కరోనా నేపథ్యంలో ఇప్పటికే దేశంలోని అనేక రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ను విధించి అమలు చేస్తున్నారు. చాలా చోట్ల లాక్డౌన్ లాంటి ఆంక్షలను అమలు చేస్తున్నారు. అయినప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో లాక్డౌన్ అనుకున్న మేర సత్ఫలితాలను ఇవ్వడం లేదు. వాటిల్లో కేరళ కూడా ఒకటి. ఈ క్రమంలోనే అక్కడి సీఎం పినరయి విజయన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అక్కడి 4 జిల్లాల్లో ట్రిపుల్ లాక్‌డౌన్‌ను అమలు చేయాలని నిర్ణయించారు. ఇంతకీ అసలు ట్రిపుల్ లాక్ డౌన్ అంటే ఏమిటి ? ఇప్పుడు తెలుసుకుందాం.
కేరళలోని తిరువనంతపురం, త్రిసూర్, ఎర్నాకుళం, మళప్పురంలలో కోవిడ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. అక్కడ లాక్డౌన్ అమలులో ఉన్నా ఫలితం ఉండడం లేదు. దీంతో ఆ నాలుగు జిల్లాల్లో ట్రిపుల్ లాక్‌డౌన్‌ను అమలు చేయనున్నారు. ట్రిపుల్ లాక్డౌన్లో భాగంగా ఆయా జిల్లాల్లో పోలీసులు కేవలం మోటారు వాహనాల్లో మాత్రమే కాకుండా టూవీలర్లపై కూడా చిన్న చిన్న వీధుల్లో తిరుగుతూ గస్తీ నిర్వహిస్తారు. కంటెయిన్మెంట్ జోన్లు ఉన్న ప్రాంతాల్లో ఏరియల్ నిఘా ఉంచుతారు. అలాగే మొబైల్ యాప్ ద్వారా ఆయా ప్రాంతాల్లో ప్రజల కదలికలపై నిఘా ఉంచుతారు.
ట్రిపుల్ లాక్డౌన్లో భాగంగా లాక్-1 కింద ప్రజలు, వారి వాహనాల కదలికలను నియంత్రిస్తారు. నిత్యావసరాలను ఇంటి వద్దకే తెచ్చిస్తారు. అందుకు వారు హెల్ప్ లైన్ నంబర్‌కు కాల్ చేయాలి. కేవలం అత్యవసర స్థితి ఉన్నవారినే పాసులతో అనుమతిస్తారు. నిబంధనలను ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు విధించడంతోపాటు కేసులు నమోదు చేస్తారు.
ఇక లాక్-2 లో భాగంగా కంటెయిన్మెంట్ జోన్లపై నిఘా ఉంచుతారు. ఆ ప్రాంతాల్లోని వారు ఎట్టి పరిస్థితిలోనూ బయటకు రాకూడదు. ఏ అవసరం ఉన్నా సరే హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయాలి. ఇక లాక్-3లో కోవిడ్ వచ్చిన బాధితులు ఉన్న ఇళ్లపై నిఘా ఉంచుతారు. కరోనా వచ్చిన వారు, వారి కుటుంబ సభ్యులను బయటకు రాకుండా చూస్తారు. వారికి అవసరం అయితే హెల్ప్‌లైన్ నంబర్ ద్వారా సేవలు అందిస్తారు. ఇలా ట్రిపుల్ లాక్‌డౌన్‌ను అమలు చేస్తారు.
కాగా గతేడాది ఏప్రిల్ నెలలో కేరళలోని కసరగడ్ జిల్లాలో కోవిడ్ కేసులు ఎక్కువగా నమోదవుతుండడంతో ఇలాగే ట్రిపుల్ లాక్‌డౌన్‌ను అమలు చేశారు. దీంతో అదే మోడల్‌ను ఇప్పుడు కేరళలో అమలు చేస్తున్నారు. అప్పుడు ట్రిపుల్ లాక్ డౌన్ వల్ల 3 వారాల్లో యాక్టివ్ కేసులు 94 శాతం తగ్గాయి. మరి ఇప్పుడు అలాగే జరుగుతుందా ? అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.