మొద‌టి డోసు తీసుకున్నాక కోవిడ్ సోకితే రెండో డోసుకు 3 నెల‌లు ఆగాలి..!

-

కోవిడ్ టీకాలకు సంబంధించి నేషనల్ ఎక్స్‌పర్ట్ గ్రూప్ ఆన్ వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్ (ఎన్ఈజీవీఏసీ) కొత్త సిఫార్సులను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అంగీకరించింది. ఎన్ఈజీవీఏసీ కొత్త సిఫారసుల ప్రకారం మొద‌టి డోసు కోవిడ్ టీకాను తీసుకున్న త‌రువాత క‌రోనా బారిన ప‌డితే క‌రోనా నుంచి కోలుకున్న త‌రువాత 3 నెల‌ల‌కు రెండో డోసు టీకాను తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మేర‌కు ఎన్ఈజీవీఏసీ సూచించిన ఈ విష‌యాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అంగీక‌రించింది.

covid infected patients who took first dose will have to wait 3 months for 2nd dose

ఇక పాలిచ్చే త‌ల్లులంద‌రూ కోవిడ్ -19 టీకాల‌ను వేయించుకోవ‌చ్చ‌ని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సిఫార‌సు చేసింది. తాజా మార్గదర్శకాల ప్రకారం కోవిడ్‌-19 టీకా వేయడానికి ముందు ఆర్‌టీ పీసీఆర్ పరీక్ష‌లు చేయాల్సిన అవ‌స‌రం లేదు. ఇక సార్స్‌-2 మోనోక్లోనల్ యాంటీబాడీస్ లేదా కన్వలేసెంట్ ప్లాస్మా ఇచ్చిన సార్స్‌-2 కోవిడ్‌-19 రోగులు ఆసుపత్రి నుండి విడుదలయ్యే తేదీ నుండి 3 నెలల వరకు టీకాను తీసుకోవ‌డాన్ని వాయిదా వేయాలి. ఆ త‌రువాతే టీకాను తీసుకోవాలి.

ఆసుపత్రిలో చేరడం లేదా ఐసీయూ సంరక్షణ అవసరమయ్యే ఇతర తీవ్రమైన అనారోగ్యాల‌తో బాధపడుతున్న వ్యక్తులు కూడా కోవిడ్‌-19 వ్యాక్సిన్ తీసుకునే ముందు 4-8 వారాలు వేచి ఉండాలి. క‌రోనా వైరస్ సోకినట్లయితే ఒక వ్యక్తి కోవిడ్ నుంచి కోలుకున్న త‌రువాత 14 రోజుల అనంత‌రం రక్తదానం చేయవచ్చు. అయితే ర‌క్త‌దానానికి ముందు ఆర్టీ పీసీఆర్ టెస్టు త‌ప్ప‌నిస‌రి. కాగా గర్భిణీ స్త్రీలకు కోవిడ్‌-19 టీకాలకు సంబంధించి ఆరోగ్య మంత్రిత్వ శాఖ చర్చలు జరుపుతోందని, రోగనిరోధకతపై జాతీయ సాంకేతిక సలహా బృందం (ఎన్‌టీఏజీఐ) మరింత చర్చించిందని అధికారులు తెలిపారు.

కోవిడ్‌-19 టీకా అన్ని అంశాలపై మార్గదర్శకాలను అందించడానికి ఎన్ఈజీవీఏసీ ని ఏర్పాటు చేశారు. ఈ క్ర‌మంలో ఇందులో ఉన్న స‌భ్యులు జనాభా సమూహాల ప్రాధాన్యత, సేకరణ, జాబితా నిర్వహణ, టీకా ఎంపిక, వ్యాక్సిన్ డెలివరీ, ట్రాకింగ్ మెకానిజం వంటి అంశాల‌పై ఎప్ప‌టిక‌ప్పుడు కేంద్రానికి సూచ‌న‌లు చేస్తుంటారు. కాగా మే 1 నుంచి జూన్ 15 వరకు రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు మొత్తం 5.86 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసులను ఉచితంగా అందిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2021 జూన్ చివరి వరకు మొత్తం 4 కోట్ల‌ 87 లక్షల 55 వేల టీకా డోసులు లభిస్తాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news