తెలంగాణలో భూముల డిజిటల్ సర్వేకు రంగం సిద్ధం

-

తెలంగాణలో భూముల డిజిటల్ సర్వేకు ముందడుగు పడింది. రాష్ట్రంలో భూముల డిజిటల్ సర్వే చేపట్టడానికి ఈ సంవత్సరం బడ్జెట్ లో రూ.400 కోట్ల నిధులను మంజూరు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. భూముల డిజిటల్ సర్వేను ముందుకు తీసుకువెళ్లేందుకు బి.ఆర్.కె.ఆర్. భవన్ లో వివిధ కంపెనీలతో సీఎస్ ప్రాథమిక స్థాయి సమావేశాన్ని నిర్వహించారు.

 

భూముల డిజిటల్ సర్వే జరిపేందుకు ఆసక్తి వ్యక్తపరిచిన 17 కంపెనీలు ఈ చర్చలో పాల్గొన్నాయి. ఇతర రాష్ట్రాలలో నిర్వహించిన భూముల డిజిటల్ సర్వే సందర్భంగా తాము ఎదురుకున్న సమస్యల గురించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆయా కంపెనీలు వివరించాయి. భూముల డిజిటల్ సర్వేకు ఉపయోగించే పద్ధతులు, సాంకేతిక పరిజ్ఞానం, సర్వేకు పట్టే సమయం, అయ్యే వ్యయము, అందుబాటులో ఉన్న సర్వే పరికరాలు, సాంకేతిక నిపుణులు , కావాల్సిన సాఫ్ట్ వేర్ , హార్డ్ వేర్ , ఇంటర్నెట్ సామర్ధ్యం తదితర అంశాల గురించి ఈ సమావేశంలో చర్చించారు.

భూముల డిజిటల్ సర్వేపై ఈ కంపెనీలతో ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలోనే సమావేశం నిర్వహించనున్నట్లు ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి తెలిపారు. ఈ సమావేశంలో ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, స్టాంపులు, రిజిస్ట్రేషన్ విభాగం కమీషనర్ అండ్ ఐజీ శేషాద్రి, టి.ఎస్‌.టి.ఎస్. ఎండి వెంకటేశ్వర్ రావు, సర్వే, సెటిల్మెంట్ & ల్యాండ్ రికార్డ్స్ కమీషనర్ శశిధర్ తదితరులు పాల్గొన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news