కరోనా వైరస్ కేసులు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. దీంతో ప్రజలకు తప్పనిసరిగా టీకాలు వేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ప్రాణాంతక వైరస్‌కు టీకాలు వేయడం మనందరికీ చాలా అవసరం. అయితే కోవిడ్ టీకాలకు సంబంధించి ప్రజలకు అనేక సందేహాలు వస్తున్నాయి. టీకా తీసుకునే ముందు, తరువాత ఏం చేయాలి, టీకా తీసుకున్నాక ఏమైనా ప్రభావాలు ఉంటాయా, లేదా అనే సందేహాలు వస్తున్నాయి. మరి ఇందుకు వైద్యులు ఏమని సమాధానాలు చెబుతున్నారంటే..
కోవిడ్ టీకా తీసుకున్న తరువాత టీకా వేయించుకున్న చోట నొప్పి ఉంటుంది. అలాగే జ్వరం, చలి, నొప్పులు, తలనొప్పి ఉంటాయి. ఇవి 1-2 రోజులు మాత్రమే ఉంటాయి. జ్వరం తగ్గేందుకు పారాసిటమాల్ ట్యాబ్లెట్ వేసుకుంటే చాలు. అయితే టీకా తీసుకున్న కొందరిలో డయేరియా వంటి సమస్యలు వస్తున్నట్లు నిర్దారించారు. అలాంటి వారు కొబ్బరినీళ్లను తాగాలని సూచిస్తున్నారు.
కోవిడ్ టీకా తీసుకున్న అనంతరం కొబ్బరి నీళ్ళు తాగాలని ప్రయాగ్రాగ్‌రాజ్ డాక్టర్ సుష్మా మోతీలాల్ సూచించారు. కొబ్బరి నీళ్లు అనేక ఆరోగ్యకర ప్రయోజనాలను అందిస్తాయి. ఇవి రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతాయని వైద్యులు సలహా ఇస్తున్నారు. అందువల్ల కోవిడ్ టీకా తీసుకున్న వారు డయేరియా బారిన పడకుండా ఉండాలంటే కొబ్బరి నీళ్లను తాగాలని చెబుతున్నారు. కొబ్బరినీళ్లలో పాల కంటే ఎక్కువ పోషకాలు ఉంటాయి. కొవ్వు పదార్థం లేదా కొలెస్ట్రాల్ ఉండదు. కొబ్బరి నీటిలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ సి, భాస్వరం ఉంటాయని ఇవి కోవిడ్ టీకా తీసుకున్న వారికి మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.
కోవిడ్ టీకా తీసుకున్న వారు కొబ్బరినీళ్లను తాగడం వల్ల అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. అలాగే రోజూ నీటిని ఎక్కువగా తాగాలి. కొన్ని రోజుల వరకు పొగతాగడం, మద్యం సేవించడం మానేయాలి. దీంతో తీసుకున్న టీకా బాగా పనిచేస్తుంది.