హైదరాబాద్: తెలంగాణలో డిగ్రీ, ఇంజనీరింగ్ కోర్సులకు సైతం ఆన్‌లైన్‌లోనే తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జూలై 1 నుంచి ఆఫ్‌లైన్ తరగతులు అంటూ ఇప్పటికే ఉన్నత విద్యామండలి మార్గదర్శకాలు ఇచ్చింది. పాఠశాలల్లో ఆన్‌లైన్ విద్యనే బోధించాలని సీఎం కేసీఆర్ కూడా చెప్పారు.
తాజాగా వృత్తి విద్యా కోర్సులను సైతం ఆన్‌లైన్‌లోనే నిర్వహించేలా ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తోంది. సోమవారం ఉదయం 10 గంటలకు విద్యాశాఖ ఉన్నతాధికారులతో మంత్రి సబితా భేటీ కానున్నారు. ఆన్ లైన్ విద్యావిధానం అమలును సబితా ఇంద్రా రెడ్డి ప్రకటించనున్నారు. ఈ ఏడాది నిర్వహించే సెట్ పరీక్షలు యధాతధంగా జరగనున్నాయి. డిగ్రీ, పీజీ ఫైనల్ ఇయర్ పరీక్షలు నిర్వహించే యోచనలో ఉన్నత విద్యామండలి ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా రాష్ర్టంలో కరోనా రెండో వేవ్ దృష్ట్యా స్కూళ్లు కూడా మూతపడ్డాయి. ఇటీవలలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వం లాక్ డౌన్ ను పూర్తిగా ఎత్తివేసింది. స్కూళ్లు, కాలేజీల్లో క్లాసులు నిర్వహించుకునేలా అదేశాలు జారీ చేసింది.