విజయవాడ: సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విడుదల చేసిన జాబ్ కేలండర్‌పై ఆందోళన వ్యక్తమవుతోంది. జాబ్ కేలండర్ పేరుతో సీఎం జగన్ మోసం చేస్తున్నారని విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. విద్యార్థులకు మద్దతుగా వామపక్ష, టిడిపి, కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంఘాల ఆందోళనకు దిగాయి. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న అన్ని పోస్ట్ లు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సిఎం జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు బయలుదేరిన విద్యార్థి సంఘాన నేతలను తుమ్మలపల్లి వద్ద అనుమతి లేదని అడ్డుకున్నారు. అరెస్టు చేసి పోలీసు స్టేషన్ కి తరలించారు. దీంతో సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.
ఎన్నికల సమయంలో జగన్ ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారని, ఇప్పుడు జాబ్ క్యాలెండర్ పేరుతో ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. జాబులు ఇవ్వమని అడిగితే జైలుకు పంపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి కేసులకు భయపడేది లేదని హెచ్చరించారు. అవినీతి కేసులో జగన్ జైలుకెళ్లారని, ప్రజల సమస్యలు కోసం తాము జైలుకి వెళ్లేందుకు సిద్దమన్నారు. క్యాబినెట్ సమావేశంలో చర్చించి ఉద్యోగాలు భర్తీ పై ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. జాబ్ క్యాలెండర్ మార్చే వరకు రాష్ట్ర వ్యాప్తంగా తమ పోరాటం కొనసాగిస్తామని విద్యార్థి సంఘాల నేతలు హెచ్చరించారు.