యాదాద్రి-భువనగిరి : భువనగిరి రహదారి బంగ్లాలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇకపై రాజకీయాల గురించి మాట్లాడననని, అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తానని చెప్పారు. రాష్ట్రంలో కష్టం వచ్చిన పేదవారికి, ఆపదలో ఉన్నకాంగ్రెస్ కార్యకర్తలకు అండగా ఉంటానని ఆయన తెలిపారు. భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తానని పేర్కొన్నారు. నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ , భువనగిరి అభివృద్ధి విషయంపై మున్సిపల్ సమావేశంలో పాల్గొంటున్నానని చెప్పారు. రాయగిరి వరకు యంయంటీస్ పొడిగింపుపై ప్రధానమంత్రితో మాట్లాడితే రూ.475 కోట్లలో 75 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తే చాలని చెప్పారని కోమటిరెడ్డి తెలిపారు. పార్లమెంట్ సభ్యుడిగా చిల్లరగా మాట్లాడ దలుచుకోలేదని వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారు.
ఇటీవల కాలంలో కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడిని నియమించిన విషయం తెలిసిందే. పీసీసీ చీఫ్‌ని ఆశించిన ఆయన ఈ నియామకంపై అసంతృప్తిగా ఉన్నారు. గాంధీ భవన్ మెట్లు కూడా ఎక్కనని బహిరంగంగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు కాంగ్రెస్ వ్యహారాల ఇంఛార్జిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ఏఐసీసీ సీరియస్ అయింది. కోమటిరెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలను హిందీలోకి అనువాదం చేయాలని రాష్ట్ర కాంగ్రెస్‌ను ఆదేశించింది. ఈ నేపథ్యంలో తాజాగా మళ్లీ కోమటి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేయడం సర్వత్రా ఆసక్తిగా మారింది.