సమాజంలో ఉన్న మన తోటి పేదలకు సహాయం చేయాలని సంకల్పించాలే గానీ ఏ విధంగానైనా సరే ఆ పనిచేయవచ్చు. సహాయం చేసేందుకు చిన్నా పెద్దా అనే తేడా ఉండదు. మంచి మనస్సు ఉంటే చాలు, ఎవరికైనా సహాయం చేయవచ్చు. అలా అనుకుంది కాబట్టే ఆ బాలిక తాను ఓ వైపు స్కూల్లో చదువుతున్నా.. పేద పిల్లలకు poor children చదువు అందాలనే ఉద్దేశంతో తానే టీచర్ గా మారి పాఠాలు చెబుతోంది.
సుషైమా బంగారాది కేరళలోని కసర్గొడ్. అలీబాగ్ లో ఆమె కుటుంబం సెటిల్ అయింది. తండ్రి సలీం బేకరీ నిర్వహిస్తున్నాడు. తల్లి రుక్సానా గృహిణి. సుషైమా వయస్సు 12 ఏళ్లు. ఆమె అలీబాగ్‌లోని సెయింట్ మేరీస్ కాన్వెంట్ స్కూల్లో 7వ తరగతి చదువుతోంది. ఇక ఆమె అన్న రజీన్ వయస్సు 16 ఏళ్లు. చెల్లెలు రెహానా 4వ తరగతి చదువుతోంది. కరోనాకు ముందు నుంచే సుషైమా తన ఇంటి వద్దే పేద పిల్లలకు పాఠాలు చెప్పేది. అయితే కరోనా వల్ల లాక్ డౌన్లను విధించడంతో పాఠాలు చెప్పేందుకు వీలు కాలేదు. దీంతో ఆమె తన సోదరుడి సహయంతో కపచినో బ్రొసిస్ అనే పేరిట ఓ యూట్యూబ్ చానల్ పెట్టింది. దాని ద్వారా పిల్లలకు పాఠాలు చెప్పడం ప్రారంభించింది.
కోవిడ్ వల్ల అనేక మంది పిల్లలు చదువుకు దూరమవుతున్నారని, అందుకనే ఈ విధంగా చానల్ పెట్టి అందులో వీడియోల ద్వారా పాఠ్యాంశాలను బోధిస్తున్నానని సుషైమా చెబుతోంది. వీడియోలను తీసేందుకు తన సోదరి సహాయం చేస్తుందని, వాటిని తన సోదరుడు ఎడిట్ చేసి చానల్లో అప్లోడ్ చేస్తాడని ఆమె తెలిపింది. కాగా ఆమె చేస్తున్న ప్రయత్నాన్ని అందరూ అభినందిస్తున్నారు. ఓ వైపు తాను స్కూల్లో చదువుతూనే మరోవైపు పేద పిల్లలకు పాఠాలు చెబుతుండడంపై ఆమెను అందరూ ప్రశంసిస్తున్నారు.