దేశవ్యాప్తంగా కోవిడ్(covid) రెండో ప్రభావం తగ్గుతుండడంతో అనేక రాష్ట్రాల్లో లాక్ డౌన్ ఆంక్షలను సడలిస్తున్నారు. తెలంగాణతోపాటు కొన్ని చోట్ల లాక్డౌన్లను పూర్తిగా ఎత్తేశారు. అయితే రోజువారీ కేసుల సంఖ్య భారీగా తగ్గినప్పటికీ కోవిడ్ రెండో వేవ్ ప్రభావం ఇంకా తగ్గలేదని, కనుక జాగ్రత్తగా ఉండాల్సిందేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ ఈ సందర్బంగా మాట్లాడుతూ కోవిడ్ రెండో ప్రభావం ఇంకా ముగియలేదని, కోవిడ్ ప్రభావం తగ్గిందని చాలా రాష్ట్రాలు ఆంక్షలను సడలిస్తున్నాయని, అయితే కోవిడ్ కేసుల సంఖ్య ఇంకా తగ్గలేదు కనుక జాగ్రత్తగా ఉండాల్సిందేనని అన్నారు. ఇక కేరళ, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, ఒడిశా, చత్తీస్గఢ్, మణిపూర్ వంటి రాష్ట్రాల్లో సడెన్గా కేసుల సంఖ్య పెరిగిందని, దీంతో ఆయా రాష్ట్రాల్లో కేంద్ర బృందాలు పర్యటించేందుకు వెళ్తున్నాయని అన్నారు. ఇది ఆందోళన కలిగించే విషయమన్నారు.
కోవిడ్ రెండో వేవ్ ప్రభావం ఇంకా తగ్గనందున రాష్ట్రాలు గ్రామీణ ప్రాంతాల్లో వైద్య రంగంలో మౌలిక సదుపాయాలను కల్పించాలని పాల్ అన్నారు. ముఖ్యంగా చిన్నారుల కోసం ఐసీయూ బెడ్లు, మందులను అందుబాటులో ఉంచాలన్నారు. ఇక ఆగస్టు – డిసెంబర్ మధ్య 216 కోట్ల డోసులు అందుబాటులోకి రానుండడం కొంత ఉపశమనం కలిగించే అంశమే అయినప్పటికీ కోవిడ్ జాగ్రత్తలను తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు.