విశాఖ: అరకులోయలో విషాదం చోటుచేసుకుంది. ముగ్గురు చిన్నారులు సహా తల్లి అనుమానస్పద స్థితిలో మృతి చెందారు. పిల్లలకు పురుగుమందు తాగించి తల్లి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. మృతులు అరకులోయ మండలం సిమిలిగూడకు చెందిన సురేఖ, కూతురు సుశాన, ఇద్దరు కుమారులు షర్విన్, సిరిల్గా గుర్తించారు. సురేఖ, శెట్టి సంజీవ్ దంపతుల మధ్య కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రిసమయంలో ఇంట్లో ఉరికి వేలాడుతున్న స్థితిలో సురేఖ, మంచంపై విగత జీవులుగా పడి ఉన్న పిల్లలను స్థానికులు గుర్తించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తండ్రి శెట్టి సంజీవ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.