మహారాష్ట్ర మరియు తెలంగాణ రాష్ట్రాలలో భారీ వర్షాలు.. కురిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో గోదావరిలో వరద ఉధృతి పెరిగింది. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ఈ నేపథ్యం లో మరి కాసేపట్లో ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. గోదావరిలో ప్రస్తుత ఇన్ ఫ్లో , ఔట్ ఫ్లో 9,41,146 క్యూసెక్కులు ఉంది.
అత్యవసర సహాయక చర్యల కోసం రెండు NDRF, మూడు SDRF బృందాలను దింపారు ఉన్నతాధికారులు. తూర్పుగోదావరి జిల్లా కూనవరం, చింతూరు, విఆర్ పురం, పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం, కెఆర్ పురంలో ఈ బృందాలను దింపారు అధికారులు. ఆలాగే గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ విపత్తుల శాఖ కె.కన్నబాబు తెలిపారు.
కాగా ఏపిలో మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ప్రధానంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పశ్చిమ దిశ నుండి గాలులు వీస్తున్నాయి. 28 జూలై 2021 న ఉత్తర బంగాళాఖాతం & పరిసరాల్లో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది.