చెన్నై: హీరో ధనుష్‌కు మద్రాస్ హైకోర్టులో షాక్ తగిలింది. రోల్స్ రాయిస్ కారు కొనుగోలు ట్యాక్స్ విషయంలో ఆయన కోర్టును ఆశ్రయించారు. రోల్స్ రాయిస్ కారును భారత్‌లో దిగుమతి చేసేందుకు భారీగా సుంకం చెల్లించాల్సి ఉంది. కారు ఖరీదుకంటే రెండు రెట్లు ఎక్కువగా పన్ను కట్టాలి. ఈ మేరకు మినహాయింపు కోరుతూ హైకోర్టును ధనుష్ కోరారు. దీంతో ఆయనపై కోర్టు సీరియస్ అయింది. సెలబ్రిటీ అయి ఉండి మినహాయింపు అడగమేంటని ప్రశ్నించింది. వాహనాలు రోడ్డుపై తిరిగేందుకు సామాన్యులే ట్యాక్స్ కడుతున్నప్పుడు తమరు ఎందుకు కట్టరని ప్రశ్నించారు. కారు కావాలంటే ట్యాక్స్ కట్టాల్సిందేనని ఆదేశించింది. కోర్టు సమయాన్ని వృదా చేసినందుకు జరిమానా కూడా విధించింది. ఈ మొత్తాన్ని తమిళనాడు ప్రభుత్వం వసూలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.
కాగా గతంలో హీరో విజయ్‌పై కూడా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 2012లో విజయ్ కొనుగోలు చేసిన రోల్స్ రాయిస్ కారుకు పన్ను మినహాయింపు ఇవ్వాలని వేసిన పిటిషన్‌ను మద్రాస్ ఉన్నత న్యాయస్థానం తీవ్రంగా తప్పు పట్టింది. అంతే కాకుండా ఆయన వేసిన పిటిషన్‌ను తోసిపుచ్చింది.
ఇంగ్లాండ్ దేశం నుంచి దిగుమతి చేసుకున్న కారుకు తప్పనిసరిగా టాక్స్ కట్టాల్సిందేనని హైకోర్టు న్యాయమూర్తి ఎం సుబ్రహ్మణ్యం తేల్చి చెప్పేశారు. అంతే కాకుండా హీరోలు పన్ను కట్టేందుకు వెనుకా డుతున్నారు అంటూ హై కోర్ట్ సీరియస్ అయింది. అలాగే పిటిషన్ పేరుతో కోర్టు సమయాన్ని వృథా చేసినందుకుగాను హీరో విజయ్ కి ఏకంగా లక్ష రూపాయలు జరిమానా విధించింది.