చిరంజీవికి తమ్ముడిగా పుట్టడం అదృష్టం : పవన్ కళ్యాణ్

-

మెగాస్టార్‌ చిరంజీవికి పవన్ కళ్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. చిరంజీవి.. నాకే కాదు ఎందరికో మార్గదర్శి స్ఫూర్తి ప్రదాత, ఆదర్శప్రాయులని… చిరంజీవి గురించి ఎన్ని చెప్పుకొన్నా కొన్ని మిగిలిపోయే ఉంటాయన్నారు. ఆయన తమ్ముడిగా పుట్టడం ఒక అదృష్టమైతే.. ఆయనలోని సుగుణాలను చూస్తూ పెరగడం మరో అదృష్టమని కొనియాడారు. అన్నయ్యను అభిమానించి ఆరాధించే లక్షలాదిమందిలో నేను తొలి అభిమానినని.. ఆయనను చూస్తూ.. ఆయన సినిమాలను వీక్షిస్తూ… ఆయన ఉన్నతిని కనులార చూశానని తెలిపారు.

ఒక అసామాన్యునిగా ఎదిగిన సామాన్యుడు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం ఆయనలోని అద్భుత లక్షణమని తెలిపారు. ”భారతీయ సినీ యవనికపై తనకంటూ ఒక స్థానం సంపాదించుకున్నా. తెలుగు సినిమాను భారత చలనచిత్ర రంగంలో అగ్రపథాన నిలబెట్టినా.. అవార్డులు రివార్డులు ఎన్ని వరించినా… నందులు తరలి వచ్చినా… పద్మభూషణ్ గా కీర్తి గడించినా..చట్ట సభ సభ్యునిగా.. కేంద్ర మంత్రిగా పదవులను ఆలంకరించినా.. ఆయన తల ఎగరేయలేదు. విజయాలు ఎన్ని సాధించినా.. రికార్డులు ఎన్ని సృష్టించినా అదే విధేయత, అదే వినమ్రత చిరంజీవి గారి సొంతం” అని పవన్‌ తెలిపారు. అందువల్లేనేమో ఆయనను సొంత మనిషిలా లక్షలాది మంది భావిస్తారన్నారు. విద్యార్థి దశలోనే సేవాభావాన్ని పెంపొందించుకున్న చిరంజీవి… నాడు రక్త నిధిని, నేడు ప్రాణ వాయువు నిధిని స్థాపించి… కొడిగడుతున్న ప్రాణాలకు ఆయువునిస్తూ తనలోని సేవాగుణాన్ని ద్విగుణీకృతం చేసుకున్నారని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news