దేశంలో అటు లోక్‌సభ ఎన్నికలే కాదు, మరి కొద్ది రోజుల్లో ఓ వైపు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఈ క్రమంలోనే ఏపీలో ఇప్పుడు రాజకీయ పార్టీల నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. నాయకులు హద్దు మీరుతూ ఒకరిపై ఒకరు తీవ్రంగా విమర్శలు చేసుకుంటున్నారు. అయితే ఈ వ్యవహార శైలి సరి కాదని, రాష్ట్రం కోసం అన్ని పార్టీలు కలసి పోరాడాల్సిన అవసరం ఉందని ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అభిప్రాయ పడ్డారు. ఈ మేరకు ఆయన నా ఆలోచన అనే యూట్యూబ్ ఛానల్ లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. అందులో ఆయన ఏపీ రాజకీయాలపై తన అభిప్రాయాలను వీక్షకులతో పంచుకున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు వేడెక్కుతున్నాయని, ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి ఏ పార్టీకి సంబంధం లేని నేత మీటింగ్‌కు పిలిస్తే అన్ని పార్టీలు హాజరు కావాలని, కానీ టీడీపీ ఉంటే మేం రాలేమని జగన్ లేఖ రాయడం సరికాదని అన్నారు. ఆ మీటింగ్‌కు అన్ని పార్టీలు హాజరయ్యాయని, కానీ జగన్ తాను రానని చెప్పడం ఎంత వరకు కరెక్ట్ అని తమ్మారెడ్డి తన వీడియోలో ప్రశ్నించారు. రాష్ట్రం కోసం, ప్రజల కోసం పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చి పోరాటం చేయాలి కానీ, అలా మీటింగ్‌కు జగన్ హాజరు కాకపోవడం సరికాదన్నారు. ఉండవల్లి పెట్టిన మీటింగ్‌కు చంద్రబాబును తిడుతున్న బీజేపీ కూడా హాజరైందని, అలాంటప్పుడు జగన్ హాజరు కాకపోవడం ఏంటని తమ్మారెడ్డి ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్ ఒక సమస్య వచ్చిందంటే దానిపై తన అభిప్రాయాన్ని తెలియజేయాల్సిన బాధ్యత ఆయనపై ఉందన్నారు. రానున్న ఎన్నికల్లో జగన్ ఏపీ సీఎం అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అందరూ అంటున్నారని, అలాంటప్పుడు ఉండవల్లి పెట్టిన మీటింగ్‌కు టీడీపీ ఉంటే రామని అనడం జగన్ చేసిన తప్పిదమే అవుతుందని తమ్మారెడ్డి అన్నారు. ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. జగన్‌కు తప్పుడు సలహాలు ఇస్తున్నారని, వారి గురించి తనకు తెలియదని, కానీ ఆ సలహాలను జగన్ పాటించకపోవడమే మంచిదని తమ్మారెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు.
తాజాగా చంద్రబాబు కూడా అఖిల పక్ష సమావేశం నిర్వహించారని ఇక దీనికి వైసీపీతోపాటు జనసేన కూడా హాజరు కాలేదని, ఈ వైఖరి సరికాదన్నారు. సీఎం పిలిస్తే కచ్చితంగా వెళ్లాలని తమ్మారెడ్డి అన్నారు. పవన్, జగన్, చంద్రబాబులు ముగ్గురూ కలసి నిర్ణయం తీసుకోవాలని, అది రాష్ట్ర భవిష్యత్తుపై ప్రభావం చూపిస్తుందని అన్నారు. వీరు ముగ్గురూ కలసి ఒకే నిర్ణయానికి వచ్చి దాన్ని ప్రజలకు తెలపాలని, దాంతో వారికి ఒక స్పష్టత వస్తుందని అన్నారు. అంతేకానీ, వాళ్లు పిలిస్తే మేం వెళ్లం అన్న ధోరణి పనికిరాదని తమ్మారెడ్డి అన్నారు. జగన్, చంద్రబాబు, పవన్‌లు ఒకే చోట కలిసే అవకాశం వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ప్రజలు, రాష్ట్రం కోసం నిర్ణయం తీసుకోవాలని, అభిప్రాయాలు పంచుకోవాలని.. అది ఒక గొప్ప పరిణామమవుతుందని తమ్మారెడ్డి అన్నారు.