ఆ ఊళ్లో పురుషులు త‌మ మీసాల‌ను ప్రాణంగా చూసుకుంటారు.. ఎందుకో తెలుసా..?

-

మూతి మీద మీసాలు ఉంటేనే రా.. మ‌గ‌వాడికి అందం.. అవి మ‌గ‌వాడి పౌరుషానికి ప్ర‌తీక‌గా నిలుస్తాయి.. అని పెద్ద‌లు అంటూ ఉంటారు. అందుకే మ‌న పెద్దలు ఎక్కువ‌గా మీసాల‌ను పెంచుకునేవారు. కానీ కాలం మారింది. నేటి త‌రుణంలో యువ‌త ఎక్కువగా మీసాల‌ను పెంచ‌డం లేదు. క్లీన్ షేవ్‌తో తిరుగుతున్నారు. అయితే నేటి ఆధునిక కాలంలోనూ ఇంకా మీసాల‌కు ప్రాధాన్య‌త‌ను ఇస్తున్న గ్రామం ఒక‌టుంది. అదెక్క‌డుందంటే…

తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లాలో లింగంప‌ల్లి క‌లాన్ అనే గ్రామం ఉంది. దీనికి మీసాల‌ప‌ల్లె అనే మ‌రో పేరు కూడా ఉంది. అయితే పేరుకు త‌గిన‌ట్టుగానే ఈ గ్రామంలో ఉండే అధిక శాతం మంది పురుషుల‌కు పెద్ద పెద్ద మీసాలు ఉంటాయి. ఇక వృద్ధుల సంగ‌తి చెప్ప‌న‌క్క‌ర్లేదు. బారెడు పొడ‌వున్న మీసాల‌తో వారు ద‌ర్శ‌న‌మిస్తారు. ఈ ఊరికి చెందిన వారు మీసాల‌కు అంత‌గా ప్రాధాన్య‌త‌ను ఇస్తారు. అయితే దీని వెనుక ఓ బ‌లమైన కార‌ణ‌మే ఉంది. అదేమింటే..

పూర్వం ర‌జాకార్ల స‌మ‌యంలో ఈ గ్రామంలోని పురుషులు భారీ మీసాల‌ను పెంచేవార‌ట‌. ర‌జాకార్ల ముందు త‌మ పౌరుషాన్ని ప్ర‌ద‌ర్శించేందుకు, వారిని బెద‌ర‌గొట్టేందుకు ఈ గ్రామంలోని పురుషులు మీసాల‌ను పెంచేవార‌ట‌. దీంతో అదే సంప్రాద‌యం ఇప్ప‌టికీ కొన‌సాగుతోంది. అందుకనే ఆ గ్రామంలో ఇప్ప‌టికీ చాలా మంది భారీ పొడ‌వున్న మీసాల‌ను పెంచుతుంటారు. అయితే మీసాల‌ను పెంచ‌కుండా క‌త్తిరించే వారిని ఈ గ్రామ‌స్తులు ఎగ‌తాళి చేస్తార‌ట‌.

ఇక లింగంప‌ల్లి క‌లాన్‌లో ఒక‌ప్పుడు పురుషులు త‌మ మీసాల‌పై నిమ్మ‌కాయ‌ల‌ను నిల‌బెట్టే వార‌ని చెబుతారు. ఈ గ్రామంలో ప్ర‌స్తుతం 230 కుటుంబాలు ఉండ‌గా, 1000 వ‌ర‌కు జ‌నాభా ఉంటుంది. మీరు మీసాలు ఎందుకు పెంచుతున్నార‌ని వారిని అడిగితే.. అవి త‌మ ఊరి పౌరుషానికి నిద‌ర్శ‌నాలు అని వారు చెబుతారు. అలాగే ప్ర‌తి ఇంట్లోనూ క‌నీసం ఒక పురుషుడు అయినా పెద్ద పెద్ద మీసాల‌తో ఇక్క‌డ ద‌ర్శ‌నమిస్తుంటారు. సాధార‌ణంగా ఇప్ప‌టి యువ‌త మాదిరిగానే ఆగ్రామంలోని యువ‌త కూడా ఆధునిక‌త బాట ప‌ట్టారు. దీంతో అక్క‌డ ఇప్పుడు మీసాల‌ను పెంచే వారి సంఖ్య త‌గ్గుతోంది. అయిన‌ప్ప‌టికీ మీసాల‌ను పెంచ‌డాన్ని ఈ ఊరికి చెందిన కొంద‌రు పురుషులు త‌మ వార‌స‌త్వానికి చిహ్నంగా కొన‌సాగిస్తూ వ‌స్తున్నారు.

ప్ర‌స్తుతం న‌డుస్తున్న ట్రెండ్‌, ఫ్యాష‌న్‌కు త‌గిన‌ట్టుగా పొడ‌వైన మీసాల‌ను పెంచే యువ‌త కూడా లింగంప‌ల్లి క‌లాన్‌లో గ్రామంలో ఉన్నారంటే అతిశ‌యోక్తి కాదు. ఇక ఈ ఊరికి చెందిన వారు చుట్ట ప‌క్క‌ల గ్రామాల్లో క‌నిపిస్తే వీరిని త్వ‌ర‌గా గుర్తు ప‌ట్టి మీసాల‌ప‌ల్లెకు చెందిన వార‌ని ఇత‌రులు సుల‌భంగా చెప్పేస్తారు కూడా. అంత‌గా ఈ ఊరు మీసాల రాయుళ్ల‌కు ప్ర‌సిద్ధి గాంచింది. ఏది ఏమైనా.. మీసాల‌పల్లె నిజంగా పౌరుషానికి ప్ర‌తీకే అని చెప్ప‌వ‌చ్చు..!

Read more RELATED
Recommended to you

Latest news