తెలంగాణలోని పలు జిల్లాలకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే హైదరాబాద్ లో వర్షాలు దంచికొడుతున్నాయి. నగరంలోని రోడ్లు జలమయమయ్యాయి. తూర్పు మధ్య అరేబియా సముద్రం నుంచి బంగాళాఖాతం వరకు తెలంగాణ మీదుగా ఏర్పడిన ఉపరితర ద్రోణి కారణంతో పాటు రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు తిరోగమిస్తుండటంతో హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చిరస్తోంది. రంగారెడ్డి జిల్లాతో పాటు నిర్మల్, నాగర్ కర్నూల్, నారాయణ పేట, జనగాం, హైదరాబాద్, వనపర్తి, మహబూబ్ నగర్, గద్వాల జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరన శాఖ హెచ్చరిస్తోంది. హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. నిన్న కురిసిన భారీ వర్షానికి నగరం అతలాకుతలం అయింది. తాజాగా మళ్లీ వర్షం కురుస్తుండటంతో అధికారుల అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ముంపు ప్రాంతాల నుంచి 150 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వర్షాలతో హైదరాబాద్ లోతట్టు ప్రాంతాల్లో డీఆర్ఎఫ్, రెస్క్యూ టీంలు మోహరించాయి.