Maha Samudram: ఆర్ఎక్స్ 100 డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్, సిద్ధార్థ్ కథానాయకులుగా తెరకెక్కించిన చిత్రం ‘మహా సముద్రం’. లవ్ అండ్ యాక్షన్ జానర్‌లో వస్తున్న ఈ చిత్రంలో అదితిరావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ కథానాయికలు నటిస్తున్నారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మహా సముద్రంలో ఏముంది? మహా కేరక్టర్ చుట్టూ తిరిగిన కథేంటి? తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే..
కథ: వైజాగ్‌లో ఉండే అర్జున్ (శర్వానంద్).. విజయ్ (సిద్దార్థ్) చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు. ఏదైనా వ్యాపారం చేసి జీవితంలో స్థిరపడాలనుకుంటాడు అర్జున్. తండ్రి చనిపోవడంతో అనాథగా పెరిగిన విజయ్ పోలీస్ ఆఫీసర్ కావాలని కలలు కంటుంటాడు. ఈ క్రమంలో మహాలక్ష్మి (అదితి రావు హైదరి) అనే అమ్మాయితో విజయ్ ప్రేమలో ఉంటే.. శ్వేత (అను ఇమ్మాన్యుయెల్)తో అర్జున్ పరిచయం ప్రేమ దిశగా మారుతుంది. ఇలా సాగుతున్న వీళ్లిద్దరి జీవితాల్లో .. తానొకటి తలిస్తే దైవం వేరొకటి తలుస్తాడు అనే విధంగా.. ఊహించని మలుపు చోటుచేసుకుంటాయి.
గూని బాజ్జీ(రావు రమేశ్), తమ్ముడు ధనంజయ్(రామచంద్రరాజు)లు వైజాగ్ సముద్రంలో స్మగ్లింగ్ చేస్తూ సీటీని తమ కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అనుకోకుండా ఓసారి విజయ్, ధనంజయ్‌కి గొడవ అవుతుంది. ఈ గొడవలో ధనంజయ్ తీవ్రంగా గాయపడతాడు. అతడు చనిపోయాడనుకుని భయంతో ఊరు విడిచి పారిపోతాడు విజయ్. మహలక్ష్మిని కూడా తీసుకెళ్లిపోమ్మని అర్జున్ చెప్పిన వినకుండా ఆమెను రైల్వే స్టేషన్‌లోనే వదిలేసి వెళ్లిపోతాడు.
ఆ తర్వాత జరిగిన అనూహ్య పరిణామాల్లో ధనుంజయ్.. అర్జున్ చేతుల్లో చనిపోతాడు. అర్జున్.. అతడి స్థానంలోకి వచ్చి వైజాగ్ కు డాన్ అవుతాడు. ఐతే కొన్నేళ్ల తర్వాత వైజాగ్ కు తిరిగొచ్చిన విజయ్.. అర్జున్ ను అపార్థం చేసుకుని అతడి కార్యకలాపాలకు అడ్డం పడతాడు. ఇంతకీ అన్నేళ్లు విజయ్ ఏమైపోయాడు.. అర్జున్ తో అతడి వైరం ఎక్కడిదాకా వెళ్లింది అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే… ఈ క్రమంలో మహా జీవితం ఎలాంటి మలుపు తిరిగింది అన్నది మిగతా కథ.
సమీక్ష: మహా సముద్రం అనేది ఓ ఎమోషనల్ లవ్‌స్టోరి.. కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది. రాసుకోండి.. అంటూ ప్రి రిలీజ్ ఈవెంట్‌లో డైరెక్టర్ అజయ్ భూపతి ఛాలెంజ్ చేశాడు. కానీ కథను చెప్పే క్రమంలో దర్శకుడు అజయ్ భూపతి అపరిమితమైన స్వేచ్ఛ తీసుకున్న కారణంగా ఏ పాత్రకూ సరైన న్యాయం లభించలేదు. సిద్ధార్థ్ పాత్ర తీరు సరిగా లేదు. ఏ పాత్రను ఎలా మొదలు పెట్టాడో ఏలా అంతం చేస్తున్నాడో తాడూ బొంగరం లేని చందంగా ఉంది.
అసలు విజయ్ పాత్రను ఠక్కున మాయం చేయడం, అనుకొకుండా నాలుగేళ్ళ తర్వాత తిరిగి తీసుకు రావడం అంత సెట్ కాలేదు. అజయ్ భూపతి తన తొలి చిత్రం RX 100ను తెరకెక్కించినంత గొప్పగా మహా సముద్రంను తెరకెక్కించలేదనే చెప్పాలి. ఎమోషనల్ లవ్‌స్టోరి అని ప్రచారం జరిగినా స్క్రీన్ మీద సరిగా ప్రజేంట్ చేయలేకపోయారు డైరెక్టర్ అజయ్ భూపతి.
నటన, వైవిధ్య భరితమైన పాత్రలకు చేసే హీరో శర్వా .. అర్జున్ పాత్రలో ఏముందని ఒప్పుకున్నాడో తెలియడం లేదని సాధారణ ప్రేక్షకుడు అనుకుంటాడు. హీరోయిజాన్ని చూపించేలా రెండు, మూడు ఫైట్స్ మినహా పాత్రలో చెప్పుకోవడానికి ఏం లేదనిపిస్తుంది. ఇక సిద్దార్థ .. దాదాపు తొమ్మిదేండ్ల తరువాత తెలుగులో రీఎంట్రీ ఇచ్చారు. విజయ్ పాత్రను అంగీకరించడం వెనుక ట్విస్ట్ ఏంటో అర్థం కావడం లేదు. ఇంటర్వెల్ ముందు వరకు కనపడే ఆ పాత్రలో సెకండాఫ్ సగానికి పైగా అయిపోయిన తర్వాత కనిపిస్తుంది.
ఇక హీరోయిన్ల పాత్రలు అసలు బేస్ లేదు. ఆ పాత్రలకు అర్థం లేదు. మహాలక్ష్మీ (అదితీరావు హైదరీ) పాత్రను డైరెక్ట్ చేయడంలో ఫాస్టాప్‌లో అజయ్ కాస్తంత మనసుపెట్టి క్యార్టెర్ డిసైన్ చేసినా.. సెకండాఫ్‌లో క్యారెటర్‌కు వాల్యూ తగ్గించాడు. ఇక స్మిత (అనూ ఇమ్మాన్యుయేల్) పాత్ర మరీ దారుణం. యాక్సిడెంట్ చేయడం, హీరో ఆదుకోవడం, ఆ తర్వాత వారి మధ్య చిగురించిన ప్రేమ, చివరిలో త్యాగం. వీటిలో ఏ ఒకటి కూడా మనసుకు హత్తుకునేలా లేనే లేదు.
అలానే విలన్ పాత్రలు సైతం సరిగా డిసైన్ చేయలేకపోయారు డైరెక్టర్. కె.జి.యఫ్‌లో విలన్‌గా ఆకట్టుకున్న రామచంద్రరాజు అదే తరహా సీరియస్ విలనిజాన్ని ఈ సినిమాలో చూపించాడు. చుంచు మామగా జగపతి బాబు చేసిన పాత్ర ఓకే.. పాత్రకు ఎంత న్యాయం చేయాలో దాన్ని జగపతిబాబు చేశారనాలి.
గూనీ బాబ్జీ( రావు రమేశ్) పాత్ర. ఫస్టాఫ్ లో తమ్ముడు ముందు చేతకాని దద్దమ్మలా ఉండటం. ఆ తమ్ముడు చనిపోయిన తరువాత.. చాణక్య నీతితో ఎదుటి వారికి చుక్కలు చూపించే గూని బాబ్జీ పాత్రను రూపొందించడం అసలు అర్థం కాలేదు. ఏదిఏమైనా.. గూనీ బాబ్జీ పాత్రకు రావు రమేశ్ తనదైన శైలిలో, హావ భావాలతో ప్రాణం పోశాడు.
ఇక కామెడీకి అంత స్కోప్ లేదనే చెప్పాలి. వైవా హర్ష కాస్తా నవ్వించే ప్రయత్నం చేశాడంతే. ఇక శరణ్య, ఇతర పాత్రధారులు వారి పాత్రల్లో మెప్పించారు. ఆర్ ఎక్స్ 100 సినిమాపై ఉన్న హోప్స్ తో సినిమాకు వచ్చిన ప్రేక్షకులను ఆ రేంజ్ లో ఆకట్టుకోలేకపోయిందనే చెప్పాలి. కథలో ఎలాంటి ట్విస్టులు, టర్నులు లేవు.
సాంకేతిక వర్గం విషయానికి వస్తే.. రాజ్ తోట సినిమాటోగ్రఫీ గురించి చెప్పుకోవాలి. సముద్ర తీరప్రాంతాలను, పాటలను బాగానే చిత్రీకరించాడు. రాజ్ తోట సినిమాటోగ్రఫీ ప్లస్ పాయింట్. సినిమా టేకింగ్ బావుంది. ఇక సంగీతం విషయానికి వస్తే.. ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు. కానీ, ఈ సినిమాను మ్యూజికల్ హిట్ చేయలేకపోయాడు. హే రంభ… సాంగ్ మినహా మిగిలినవేవీ కనెక్ట్ కావు. కానీ.. నేపథ్య సంగీతం పరావాలేదనే చెప్పాలి.
ఈ చిత్రంలో కొన్ని డైలాగ్స్ సాదారణ ప్రేక్షకుడి కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. నువ్వు సముద్రంలాంటోడివి.. నీలో అన్ని నదులు కలవాలనుకుంటాయి. కానీ అన్నింటికీ కుదరవు అని హీరో పాత్రను ఉద్దేశించి అను ఇమ్మాన్యుయేల్ చెప్పే డైలాగ్. విలన్ నీ కుటుంబాన్ని చంపేస్తాడని జగపతిబాబు హీరోకు చెప్పినప్పుడు అలా నిజంగా వాడు వస్తే.. యుముడు పెట్టిన ముహూర్తాని కంటే నిమిషం ముందే వాడ్ని చంపేస్తానని హీరో శర్వానంద్ చెప్పడం.
మహా సముద్రం.. టైటిల్ ఉన్న డెప్త్ సినిమాలో లేదని చెప్పాలి. ఎ.కె. ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ మాత్రం ప్రొడక్షన్ విషయంలో రాజీ పడలేదని అర్థమవుతుంది. ఈ సినిమాను చూస్తే.. పలువురు నటులు ఎందుకు రిజెక్ట్ చేశారో అర్థమవుతుంది. మూడేళ్ళుగా ఈ కథతో ప్రయాణం చేస్తున్న అజయ్ భూపతి దాన్ని భుజాల నుండి దించేశాడనే ఫీల్ వచ్చింది.
సినిమా: మహా సముద్రం
నటీనటులు: శర్వానంద్, సిద్ధార్థ్, జగపతిబాబు, రావు రమేష్, అదితిరావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్, శరణ్య తదితరులు
నిర్మాణ సంస్థ: ఏకే ఎంటర్‌టైన్మెంట్స్
రచన, దర్శకత్వం: అజయ్ భూపతి
ప్రొడ్యూసర్: సుంకర్ రామబ్రహ్మం
కో ప్రొడ్యూసర్: అజయ్ సుంకర
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గరికపాటి
మ్యూజిక్: చైతన్య భరద్వాజ్
సినిమాటోగ్రఫీ: రాజ్ తోట