తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మరోసారి భూ ప్రకంపనలు కలకలం రేపాయి. మంచిర్యాల జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఇటీవల భూప్రకంపనలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా మంచిర్యాల జిల్లాలో మరోసారి భూమి కంపించినట్టయిందని తెలుస్తోంది. జిల్లాలోని వేమనపల్లి మండలం గొల్లపల్లి గ్రామంలో భూమి స్వల్పంగా కంపించింది. అదేవిధంగా లక్షెట్టిపేట మండలంలోనూ స్వల్ప భూప్రకంపనలు నమోదయ్యాయి.
సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో దాదాపు మూడు సెకన్ల పాటు భూమి కంపించిందని స్థానికులు చెబుతున్నారు. అంతేకాకుండా కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా లో దాదాపు మూడు సెకన్ల పాటు భూమి కంపించింది. దాంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. చింతల మానేపల్లి లో భూ ప్రకంపన లకు ఇల్లు కూడా కూలిపోయింది. పెంచికల్పేట..సలుగుపల్లి లో కూడా భూప్రకంపనలు చోటు చేసుకున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. రెండోసారి భూప్రకంపనలు చోటు చేసుకోవడంతో జిల్లా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.