టీ కాంగ్రెస్ లో కొనసాగుతున్న బుజ్జగింపుల పర్వం..

-

టీకాంగ్రెస్ పార్టీలో బుజ్జగింపుల పర్వం కొనసాగుతూనే ఉంది. అలక మీద ఉన్న నేతలను బుజ్జగించే పనులను కాంగ్రెస్ పలువురు నాయకులకు అప్పగించింది. హుజూరాబాద్ ఎన్నికల్లో ఘోర పరాజయం కాంగ్రెస్ పార్టీలో కాక రేపుతూనే ఉంది. డిపాజిట్ రాకుండా ఓడిపోవడం ఆపార్టీ సీనియర్లకు మింగుడు పడటం లేదు. దీంతో సీనియర్లందరూ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, జానారెడ్డి, పొన్నంప్రభాకర్, జగ్గారెడ్డితో పాటు ప్రేమ్ సాగర్ రావు వంటి సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలిపై అసంత్రుప్తితో ఉన్నారు. నిన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ కీలక నేత మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు పార్టీ తీరుపై బహిరంగంగానే విమర్శలు చేశారు. పార్టీలో కష్టపడిన వారికి పదవులు దక్కడం లేదని ఆరోపణలు చేశారు. అయితే ప్రస్తుతం అలకమీదున్న కాంగ్రెస్ నాయకులను బుజ్జగించే పనిలో ఆపార్టీ నేతలు ఉన్నారు.

టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని నియమించినప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. మొన్న హుజూరాబాద్ ఎన్నికల్లో ఓటమి అనంతరం కాంగ్రెస్ తీరుపై ఏఐసీసీకి ఫిర్యాదు చేస్తా అని చెప్పారు. హుజూరాబాద్ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మానిక్కం ఠాగూర్ అధ్యక్షతన జరిగిన పొలిటికల్ ఎఫైర్స్ సమావేశానికి కూడా కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి హాజరు కాలేదు. కాగా కోమటి రెడ్డిని బుజ్జగించే పనిని సీనియర్ నేత వీ. హన్మంత రావుకు పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ అప్పగించింది. నిన్న సీఎల్పీలో ఇరువురు నేతల మధ్య భేటీ కూడా జరిగింది. కోమటి రెడ్డి వ్యవహారాన్ని స్వయంగా మానిక్కం ఠాగూర్ పర్యవేక్షిస్తున్నారు.

తాజాగా మరో కాంగ్రెస్ నేత మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావును ఏఐసీసీ ఇంఛార్జ్ బోసురాజు బుజ్జగించే పనిలో ఉన్నారు. ప్రేమ్ సాగర్ రావుతో బట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శులు మాట్లాడుతన్నట్లు తెలిసింది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క నేతను కూడా దూరం చేసుకునే పరిస్థితిలో లేదని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. వచ్చే పీఏసీ సమావేవంలో జరగుతున్న పరిణామాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. అయితే టీ కాంగ్రెస్ నేతల్లో బుజ్జగింపుల పర్వం ఎప్పుడు కొలిక్కి వస్తుందో తెలియని పరిస్థితి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news