ఆఫ్ఘనిస్తాన్ లో పేలుళ్లు ఆగడం లేదు. వరసగా ఎక్కడో ప్రావిన్స్ లో పేలుళ్లు చూస్తున్నాం. తాజాగా మరోమారు ఆప్ఘన్ నెత్తురోడింది. మరోసారి బాంబుల మోతతో దద్ధిరిల్లింది. నంగన్ హార్ ప్రావిన్స్ స్పిన్ గర్ జిల్లాలో పేలుడు సంభవించింది. స్థానికంగా ఉండే మసీదులో శుక్రవారం ప్రార్థనలు టార్గెట్గా బాంబు పేలుడు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ దాడిలో ఇప్పటివరకు ముగ్గురు చనిపోగా..15 మంది తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.
ఆగస్టు నెలలో ఆఫ్ఘన్ లో అధికారం చేపట్టిన తర్వాత నుంచి వరసగా పేలుళ్లు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఐసిస్-కే ఉగ్రవాద సంస్థ వరస దాడులకు తెగబడుతోంది. గతంలో అమెరికన్ పౌరులను, దళాలను తరలించే క్రమంలో కాబూల్ ఎయిర్ పోర్ట్ వద్ద భారీ పేలుడు సంభవించింది. దీంతో పౌరులతో పాటు పలువురు అమెరికన్ సైనికులు కూడా మరణించారు. దీని తర్వాత రెండు మసీదుల్లో భారీపేలుళ్లతో దాదాపు 120 మంది దాకా సాధారణ పౌరులు మరణించారు. హజారా మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని గతంలో దాడులకు పాల్పడింది ఐసిస్ కే ఉగ్రవాద సంస్థ.