ఘాటు ఘాటుగా.. చిల్లీ చికెన్‌.. చేద్దాం ప‌దండి..!

-

చికెన్‌.. ప‌చ్చిమిర్చితో ఘాటుగా చేసే చిల్లీ చికెన్ అంటే అంద‌రికీ ఇష్ట‌మే. చాలా మంది ఈ వంట‌కాన్ని చాలా ఇష్టంగా తింటారు. అయితే దీన్ని అంద‌రూ ఎక్కువ‌గా రెస్టారెంట్ల‌లోనే తింటుంటారు. కానీ.. కొద్దిగా ప్ర‌య‌త్నిస్తే మ‌నం మన ఇంట్లోనే చిల్లీ చికెన్ త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. మ‌రి చిల్లీ చికెన్‌ను ఎలా త‌యారు చేయాలో, అందుకు ఏయే ప‌దార్థాలు అవ‌స‌ర‌మో.. ఇప్పుడు తెలుసుకుందామా..!

చిల్లీ చికెన్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు:

బోన్‌లెస్ చికెన్ – 500 గ్రాములు
సోయాసాస్ – 1 టీస్పూన్
కోడిగుడ్డు – 1
మొక్క‌జొన్న పిండి – 2 టీస్పూన్లు
ప‌చ్చి మిర‌ప‌కాయ‌లు – 5
వెల్లుల్లి రెబ్బలు – 4
ఉల్లిపాయ పేస్ట్ – 3 టీస్పూన్లు
మిరియాల పొడి – అర టీస్పూన్
చ‌క్కెర – 1 టీస్పూన్
నీరు – 2 క‌ప్పులు
నూనె – త‌గినంత

చిల్లీ చికెన్ త‌యారీ విధానం:

ముందుగా ఒక గిన్నె తీసుకోవాలి. అందులో చికెన్ ముక్క‌లు వేయాలి. వాటిపై స‌గం సోయా సాస్‌, మొక్కజొన్న‌పిండి, గుడ్డు, ఉప్పు వేసి బాగా క‌ల‌పాలి. ఆ మిశ్ర‌మంపై మూత పెట్టి 30 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. పాన్‌లో నూనె వేడి చేసి అందులో మారినేట్ చేయ‌బ‌డిన చికెన్ ముక్క‌ల‌ను బంగారు రంగు వ‌చ్చే వ‌ర‌కు వేయించి ప‌క్క‌న పెట్టుకోవాలి. అనంత‌రం మ‌రొక పాన్ తీసుకుని అందులో కొద్దిగా నూనె వేసి స‌న్న‌గా క‌ట్ చేసిన ప‌చ్చి మిర‌ప‌కాయ‌లు, వెల్లుల్లి వేసి కొద్దిగా ఫ్రై చేయాలి. అనంత‌రం అందులో నీరు పోసి మ‌రిగించాలి. మ‌రుగుతున్న‌ప్పుడు చ‌క్కెర‌, మిరియాల పొడి, ఉప్పు, మిగిలిన సోయా సాస్ వేయాలి. త‌ర్వాత అందులో ముందుగా వేయించి పెట్టుకున్న‌ చికెన్ ముక్క‌లు వేసి క‌లపాలి. మొత్తం నీరంతా ఇగిరిపోయాక స‌న్న‌గా త‌రిగిన ఉల్లిపాయ‌ల‌ను వేసి దించాలి. అంతే.. చిల్లీ చికెన్ త‌యార‌వుతుంది..!

Read more RELATED
Recommended to you

Latest news