ఈ మధ్య సోషల్ మీడియాలో హోమ్ టూర్ లు ఎక్కువైపోతున్నాయి కదా..మీరు ఇది చూశారా..చాలమంది ఇళ్లల్లో గ్రీన్ వాల్స్ ఉంటున్నాయి. గ్రీన్ వాల్ అంటే గ్రీన్ కలర్ వాలు కాదు..చిన్న చిన్న మొక్కలతోనో, తీగలతోనే గోడను అలంకరిస్తున్నారు. ఇండోర్ అందాలకు ఇలాంటి వాల్స్ చాలాబాగా ఉపయోగపడుతాయి. వీటిని చేసుకోవటం కూడా సులభమే. ఇండిపెండెంట్ హౌస్ అయినా, అపార్ట్మెంట్లలో అయినా ఇంట్లో పచ్చదనం ఉంటే ఆ కళే వేరు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇక ఇంట్లో ఒక గోడ మొత్తం పచ్చదనం నింపుకుంటే ఎంత అందంగా ఉంటుందో ఈ గ్రీన్‌వాల్స్ ఏర్పాటు చూస్తే అర్థమైపోతుంది.
ఔషధ మొక్కలతో గ్రీన్ వాల్
వేలాడే పచ్చదనం కోసం అందమైన క్రీపర్స్‌ను గోడల మీదకు పాకించవచ్చు. లేదంటే ఇండోర్ ప్లాంట్స్‌తో గోడకు గ్రీనరీ ఏర్పాటు చేసుకోవచ్చు. అందులోనూ ఈ మహమ్మారి కాలంలో రకరకాల ఔషధ మొక్కల పెంపకం ఇంట్లోగాలిని ప్యూరిఫై చేస్తుంది. కొన్ని మొక్కలు మాత్రమే గ్రీన్వాల్కి బాగా సూట్ అవుతాయి. వాటిలో కొన్ని రకాల ఔషధ మొక్కలు, ఆర్కిడ్స్, మనీప్లాంట్ లాంటి తీగ జాతి మొక్కలను ఎంచుకోవాలి. వీటి ఎంపికలో నిపుణుల సాయం తీసుకోవచ్చు. మనీ ప్లాంట్స్ ఇంట్లో ఉండటం మంచిదే కానీ..వాటివల్ల డెంగ్యూ దోమలు వచ్చే ప్రమాదం ఉందట.
కృత్రిమమైన పచ్చని తీగలతో .
సహజమైన మొక్కలతో ఏర్పాటు, వాటి మెయింటెనెన్స్ కొంచెం కష్టం అనుకున్నవారు ఆర్టిఫిషియల్ హ్యాంగింగ్ తీగలు, లతలతో లివింగ్ రూమ్ లేదా బాల్కనీలో ఒక గోడకు పచ్చదనాన్ని నింపవచ్చు. హాయిగొలిపే ఆనందాన్ని ఆస్వాదించవచ్చు.
గ్రీన్ ఫ్రేమ్
పూర్తి గోడను ప్లాంటేషన్‌తో నింపితే బాగుండదు అనుకుంటే ఫ్రేమ్ పరిమాణంలోనూ ఆకుపచ్చని మొక్కలతో గదికి కొత్త అందాన్ని తీసుకురావచ్చు. మంచి బ్యాక్ గ్రౌండ్ గా కూడా ఉంటుంది. ఫోటోలు దిగేందుకు, వీడియోస్ చేసేందుకు ఈ మధ్య అందరూ ఇదే పాటిస్తున్నారు.
కొన్ని జాగ్రత్తలు
►స్ట్రెయిట్, వెర్టికల్ గార్డెన్స్‌కి ప్రత్యేకమైన కుండీలు అవసరం. ఇవి మార్కెట్లోనూ, ఆన్లైన్ మార్కెట్లోనూ అందుబాటులో ఉన్నాయి.
►మీ గోడను నీటి చెమ్మ నుంచి కాపాడుకోవాలి. అందుకు గోడను ఫ్లైవుడ్ లేదా ఇతరత్రా సెట్ చేసుకోవాలి.
►కింద ఫ్లోర్ కూడా తేమ లేకుండా పొడిగా ఉండేలా మ్యాట్ వేసుకోవాలి. మీ గ్రీన్ వాల్‌కు తగినంత సూర్యకాంతి పడేలా చూసుకోవాలి. అదనంగా కాంతినిచ్చే ఫ్లోరోసెంట్ ట్యూబ్స్‌ను వాడాలి.
గృహిణులకు వీటిపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడూ తమ ఇల్లు అందంగా ఉండాలి అనే ఆలోచన వారికే ఎక్కువగా అనిపిస్తుంది. ఒకవేళ మీ ఇంటికి గ్రీన్ వాల్స్ చేసే అవకాశం ఉంటే ట్రై చేసి చూడండి.