ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకుండా కూటమి ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మండిపడ్డారు. విద్యార్థుల పై చంద్రబాబు కక్షగట్టారు అని ఆయన విమర్శించారు. ఈ క్రమంలో చదువులకు నిలయమైన ఏపీలో దౌర్భాగ్యకర పరిస్థితులు నెలకొన్నాయని వైఎస్ జగన్ దుయ్యబట్టారు. చంద్రబాబు గారు రాగానే అన్ని రంగాల్లోనూ తిరోగమనమే కనిపిస్తోంది అని విమర్శించారు. ముఖ్యంగా విద్యారంగాన్ని దారుణంగా దెబ్బతీశారని ఆయన మండిపడ్డారు.
‘అమ్మఒడి, ఇంగ్లీష్ మీడియం, టోఫెల్, ట్యాబులు, బైజూస్ కంటెంట్, నాడు-నేడును బాబు రద్దు చేశాడు. వైసీపీ హయాంలో తల్లుల ఖాతాలకే వసతి, విద్యా దీవెన జమ చేసేవాళ్లం. ఇప్పుడు అది కూడా లేకుండా పోయింది’ అని ఆయన ఫైర్ అయ్యారు. ఇక వైసీపీ హయాంలో ప్రతి త్రైమాసికం పూర్తి కాగానే తల్లుల ఖాతాలో జమ చేసే వాళ్లం అని చెప్పారు. ఇలా గత విద్యాసంవత్సరం డిసెంబర్ త్రైమాసికం వరకూ రూ. 12,609 కోట్లు ఒక్క విద్యా దీవెనకు ఖర్చు చేశామని వైఎస్ జగన్ అన్నారు.