వాతావ‌ర‌ణంలో మార్పులే కేర‌ళ విప‌త్తుకు కార‌ణం..!

-

ప్ర‌కృతి సృష్టించిన భీభ‌త్సానికి కేర‌ళ రాష్ట్రం అత‌లాకుత‌లమైంది. భారీ వ‌ర్షాల కార‌ణంగా గత వందేళ్లలో ఎన్నడూ లేని విధంగా సంభ‌వించిన‌ ఈ భారీ విపత్తు ధాటికి కేర‌ళ‌ తల్లడిల్లిపోయింది. ఇప్పుడు వరదల ధాటికి జరిగిన విధ్వంసం భవిష్యత్తులో కూడా జరిగే అవకాశముందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు కారణం మానవ తప్పిదాలే అని వారు చెబుతున్నారు. పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్‌తో వాతావరణంలో అనేక మార్పులు చోటుచేసుకోనున్నాయని హెచ్చరిస్తున్నారు.

ఈ సారి సాధారణ వర్షపాతం కంటే రెండున్నర రెట్లు ఎక్కువగా వర్షాలు కురవటం, దాని పర్యావసానంగా వరదలు ముంచెత్తడం కేరళ రైతుకు తీరని నష్టం మిగిల్చింది. ఇది వాతావరణంలో మార్పుల వల్లే జరిగిందని భారతీయ వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.వాతావరణంలో చోటుచేసుకున్న మార్పులవల్లే ప్రస్తుతం కేరళలో వరదలు పోటెత్తాయని కిరా వింకే అనే శాస్త్రవేత్త చెప్పారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఎవరి ఊహకు అందని భారీ విపత్తు భవిష్యత్తులో వచ్చే అవకాశముందని ఆమె హెచ్చరించారు.

గత దశాబ్దంలో భూతాపం పెరిగిపోవడం వల్ల మధ్య భారత దేశం, దక్షిణ భారత దేశాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయని రష్యా అకాడెమీ ఆఫ్ సైన్సెస్ ‌లో ప్రొఫెసర్ గా పని చేస్తున్న మరో శాస్త్రవేత్త ఎలీనా తెలిపారు. భూమిపై నమోదైన ఉష్ణోగ్రత పెరుగుదల తర్వాతే ఇలాంటి విపత్తులు సంభవించినట్లు తమ పరిశీలనలో తేలిందని చెప్పారు. ఇప్పుడు కనుక జాగ్రత్త పడకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున నష్టపోవాల్సి వస్తుందని వారు హెచ్చరిస్తున్నారు. పెరుగుతున్న జనాభాతోపాటు గ్లోబల్ వార్మింగ్ కూడా పెరిగిపోతుండటం తద్వారా వాతావరణంలో మార్పులతో విపత్తులు సంభ‌విస్తున్నాయని సైంటిస్టులు చెబుతున్నారు. మానవ తప్పిదాలను నియంత్రించకుంటే… ప్ర‌జ‌ల‌కు భూమిపై నివసించేందుకు కూడా చాలా కష్టంగా మారుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. సముద్రం మట్టం పెరిగిపోవడం వల్ల కోస్తా తీరంలో ఉన్న నగరాలకు ప్రమాదం వాటిల్లుతుందని సైంటిస్టులు హెచ్చ‌రిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news