పుల్వామా దాడులకు ప్రతీకార చర్యగా భారత వైమానిక దళం ఇవాళ తెల్లవారుజామున పాక్‌లోని ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిని కేవలం 21 నిమిషాల్లోనే పూర్తి చేయగా, అందులో 300కు పైగా పాక్ ఉగ్రవాదులు మృతి చెందినట్లు తెలిసింది. అయితే ఈ దాడులకు అమెరికా సహకారం అందించిందని తెలుస్తున్నది. పాకిస్థాన్‌పై దాడుల అనంతరం అమెరికా జాతీయ భద్రతాధికారి జాన్ బోల్టన్‌తో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చర్చించినట్లు తెలిసింది. అయితే భారత్ ఎలాంటి దాడులు చేయనుందనే సమాచారాన్ని ఇప్పటికే అమెరికాతో పంచుకున్నట్లు తెలిసింది.
బాలాకోట్‌లో వాయుదళంతో దాడులు జరుపుతామనే సమాచారాన్ని అజిత్ దోవల్ జాన్ బోల్టన్‌కు ముందుగానే తెలియజేశారని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే అమెరికాకు చెప్పినట్లుగానే ప్లాన్‌లో ఏ మార్పు చేయకుండా భారత్ ఉగ్రవాదులపై దాడి చేసింది. ఇందులో భారత వైమానిక దళ సైనికులు పాక్ ఉగ్రవాదులను మట్టుబెట్టారు. అయితే మృతి చెందిన ఉగ్రవాదుల్లో ఆత్మాహుతి బాంబర్లు ఎక్కువ మంది ఉన్నట్లు సమాచారం. కాగా పాక్ లో ఉన్న ఉగ్రవాద శిబిరాల గురించి అమెరికా కూడా భారత్‌కు సమాచారం అందించిందని, దాంతోనే భారత్ పక్కాగా దాడులు చేసిందని కూడా తెలుస్తోంది.
ఫిబ్రవరి 16వ తేదీ తరువాత బోల్టన్ రెండు సార్లు అజిత్ దోవల్ తో మాట్లాడినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే భారత్ దాడులు చేయడం సబబే అని జాన్ అన్నట్లు తెలిసింది. ఈ క్రమంలో పుల్వామా దాడిలో చనిపోయిన భారత జవాన్లకు జాన్ తన ప్రగాఢ సానుభూతి కూడా తెలిపారు. అంతేకాదు, పాక్ ఉగ్రవాదులకు అడ్డాగా మారిందని, ఆ దేశం ఉగ్రవాదులకు నీడనివ్వడం మానకోవాలని కూడా జాన్ తెలిపారు. ఈ క్రమంలోనే అటు అమెరికాతోపాటు ప్రపంచ దేశాలన్నీ ఇవాళ భారత్ జరిపిన దాడిని ప్రశంసిస్తున్నట్లు తెలిసింది..!