దేశంలో కరోనా వ్యాక్సిన్ల కార్యక్రమాన్ని వేగవంతం చేశాయి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు. ఓమిక్రాన్ వేరియంట్ భయంతో ప్రజలు కూడా వ్యాక్సిన్ వేసుకునేందుకు ముందుకు వస్తున్నారు. అయితే టీకా వేసుకుంటే .. కొన్ని చోట్ల స్మార్ట్ ఫోన్లు బహుమతితో పాటు ..మరికొన్ని చోట్ల మద్యంపై ఆఫర్ల ప్రకటించడం చూశాం. వ్యాక్సిన్ వేసుకోకుండా రావడం నిషేధించింది కర్ణాటక రాష్ట్రం. తాజాగా వ్యాక్సిన్లపై నిర్లక్ష్యం వహిస్తున్నవారికి అదిరిపోయే షాక్ ఇచ్చింది ’టెస్కాబ్‘.
ఈ నేపథ్యంలో టీకాలు తీసుకుంటేనే ఈ నెల వేతనం అందిస్తామని టెస్కాబ్ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా వ్యాక్సిన్ తీసుకుంటేనే నెల జీతం ఇస్తామని, ఇప్పటి వరకు వేయించుకోని వారు ఉంటే వెంటనే కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని కోరింది. వ్యాక్సిన్ పొంది ధ్రువపత్రం సమర్పించాలని ఉద్యోగులకు ‘తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంకు’(టెస్కాబ్) తాజాగా ఆదేశాలు జారీచేసింది. ఏదైనా కారణంతో టీకా తీసుకోలేని ఉద్యోగులు.. అందుకు కారణాలు, ఆధారాల పత్రాలను వైద్యుల ధ్రువీకరణతో అందజేయాలని బ్యాంకు ఎండీ డాక్టర్ నేతి మురళీధర్ స్పష్టం చేశారు. ఉద్యోగులందరికీ టీకాలు ఇచ్చేందుకు గత జూన్ 12న, తిరిగి సెప్టెంబరు 24న ప్రత్యేక శిబిరాలు నిర్వహించినా కొందరు పొందలేదని తెలిపారు. ఇలాంటి నిర్లక్ష్యం వల్ల బ్యాంకులకు వచ్చే సాధారణ ప్రజలకు కరోనా సోకే అవకాశం ఉన్నందున టీకాలను తప్పనిసరి చేసినట్లు ఆయన వివరించారు.