పుష్కలంగా నీళ్లు ఉన్నాయి. రబీలో వరి వేయద్దంటున్నారు…కొడుకును ఇంజనీరింగ్ చదివియ్యాలే అంటూ ఓ రైతు తన బాధలను చెప్పుకుంటూ.. సీఎం కేసీఆర్ కు లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మెదక్ జిల్లా హావేలి ఘన్పూర్ బొగుడు భూపతిపూర్ లో చోటు చేసుకుంది.
’’ ప్రభుత్వం చెప్పినట్లు సన్నరకం వరి ధాన్యం పండిస్తే దిగుబడి తక్కువగా వచ్చిందని.. వచ్చిన పంటకు కనీస మద్దతు ధర రాలేదని.. పుష్కలంగా నీళ్లు ఉన్నాయని.. ఇప్పుడు రబీలో వరి వేయద్దని చెబుతున్నారని.. నేను కౌలుదారులకు ఏం ఇయ్యాలే అంటూ రైతు లేఖలో తన ఆవేదనను తెలిపాడు. నా తండ్రికి 60 ఏళ్లైనా పింఛను రావడం లేదు. నాకుమారుడు 8 తరగతి చదువుతున్నాడు.. అతణ్ని ఇంజనీరింగ్ చదివియ్యాలే‘‘ అంటూ తన ఆశను లేఖలో సీఎం కేసీఆర్ తెలుపుతూ.. పురుగుల మందు తాగి రైతు కరణం రవికుమార్ (40) బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆత్మహత్య చేసుకున్న చోటు నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ కు రాసిన లేఖను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు ప్రారంభించారు.