దేశంలో ఓమిక్రాన్ విస్తరిస్తున్న వేళ ప్రభుత్వాలు అలెర్ట్ అయ్యాయి. పలు రాష్ట్రాల ప్రభుత్వాలు కఠినంగా కోవిడ్ మార్గదర్శకాలను అమలు చేస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచంలో 50కి పైగా దేశాల్లో 2 వేలకు పైగా ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఇండియాలో ఇప్పటి వరకు 23 ఓమిక్రాన్ కేసులు నమోదవ్వడం కలవరం కలిగిస్తుంది. దేశంలో మహారాష్ట్రలో 10 ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. ముఖ్యంగా ముంబై ఎయిర్ పోర్ట్ కు వచ్చేవారికి ఆర్టీపీసీఆర్ టెస్టులు చేస్తున్నారు.
అయితే మరోవైపు ఓమిక్రాన్ వచ్చిన వారికి స్వల్ప లక్షణాలే ఉంటున్నాయి. ప్రపంచంలో ఇప్పటి వరకు ఒక్క ఓమిక్రాన్ మరణం కూడా సంభవించలేదు. ఓమిక్రాన్ వ్యాప్తి డెల్టాతో పోలిస్తే ఎక్కువగా ఉన్నా… లక్షణాల తీవ్రత స్వల్పంగానే ఉంటుందని ప్రపంచ దేశాల వైద్య నిపుణులు చెబుతున్నారు.
తాజాగా పుణేలో మొదటి ఓమిక్రాన్ వ్యక్తి , వ్యాధి నుంచి కోలుకున్నాడు. పూణే నగరానికి చెందిన మొదటి ఓమిక్రాన్ రోగికి తాజాగా చేసిన RT-PCR పరీక్షలో నెగెటివ్ వచ్చింది. ఈ రోజు ఇంటికి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాడని డాక్టర్ సంజీవ్ వావరే, పూణే మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చెబుతున్నారు. ఇటీవల ముంబైకి చెందిన ఓ వ్యక్తి ఇటీవల కోలుకోవడం చూశాం. మిగతా వారు కూడా వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. వీరంతా ప్రస్తుతం కోలుకుంటున్నట్లుగా సమాచారం.