కృష్ణా నది యాజమాన్య బోర్డు చైర్మన్‌కు తెలంగాణ రాష్ట్ర ఈఎన్‌సీ మురళీధర్ మరోసారి లేఖ రాశారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో పేర్కొన్న రెండు అంశాలను ఒకటిగా చేర్చాలని కోరారు. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ రెండవ కాంపోనెంట్‌ను 25 టీఎంసీల నుంచి 40 టీఎంసీలకు పెంచినట్టు గెజిట్ నోటిఫికేషన్‌లో చూపించడం సరికాదన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కల్వకుర్తి ఆయకట్టును 2.5లక్షల నుంచి 3.65లక్షల ఎకరాలకు పెంచినా.. నీటి కేటాయింపులు పెంచలేదని చెప్పారు. పెంచిన ఆయకట్టుకు సరిపోయే నీటి కేటాయింపులను తెలంగాణ ప్రభుత్వం చేసిందే తప్ప… కొత్తగా ఆయకట్టును పెంచలేదని లేఖలో తెలిపారు.
కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం శ్రీశైలం రిజర్వాయర్ నుంచి 800 అడుగుల వద్ద నీటిని తీసుకునేట్టు 2006లోనే బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యునల్ ఎదుట నివేదించిన డీపీఆర్‌లో ఉందన్నారు. కల్వకుర్తి ఆయకట్టు పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను లేఖకు జత చేశారు.