ఏపీ ప్రజలు తమకు ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలో వారే నిర్ణయించుకోవాలని అన్నారు. ఏపీ ప్రజల అనుమతి లేకుండా వారి డేటాను టీడీపీ ప్రభుత్వం దొంగిలించిందని కేటీఆర్ ఆరోపించారు.
రాజకీయ పార్టీలు అధికారంలోకి రావడానికి ఏం చేయడానికైనా వెనుకాడవు. అందుకోసం అవసరమైతే అన్ని అడ్డ దారులను తొక్కుతుంటాయి. ప్రజలను మోసం చేస్తుంటాయి. అనేక రకాలుగా వంచన చేసి ఎలాగైనా అధికారంలోకి రావాలని నేతలు చూస్తుంటారు. అయితే ఈ విషయాలన్నీ.. ఏపీ సీఎం చంద్రబాబు, టీడీపీ అండ్ కో.. కు కరెక్ట్‌గా సరిపోతాయనే చెప్పవచ్చు. ఎందుకంటే రానున్న ఎన్నికల్లో ఏపీలో వైసీపీయే అధికారంలోకి వస్తుందని ఇప్పటికే సర్వేలన్నీ తేల్చేశాయి. దీంతో తమకు ఎన్నికల్లో దారుణ ఓటమి తప్పని భావించిన బాబు బృందం చివరికి ఓ భారీ స్కెచ్ వేసినట్లు తెలిసింది. ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఆ పార్టీ ఓ మాస్టర్ ప్లాన్‌ను వేసింది. అదేంటో తెలిస్తే ఎవరైనా షాకవుతారు.
టీడీపీ యాప్‌లో ఏపీ ప్రజల వ్యక్తిగత వివరాలు.. కేసు విచారణ చేపట్టిన తెలంగాణ పోలీసులు…
ఏపీలో ఓ వైపు ఎన్నికల వేడి రాజుకుంటుండగా… మరోవైపు ఆ రాష్ట్రానికి చెందిన సంక్షేమ పథకాల లబ్దిదారుల డేటా చౌర్యం అంశం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. టీడీపీకి చెందిన సేవా మిత్ర యాప్ తెలుసు కదా. అందులో టీడీపీ తన పార్టీ కార్యకర్తల సమాచారం స్టోర్ చేస్తుంటుంది. అయితే నిజంగా అలా జరిగితే ఇక గొడవ ఏముంటుంది ? కానీ అందుకు విరుద్ధంగా ఆ యాప్‌లో ఏపీకి చెందిన సంక్షేమ పథకాల లబ్దిదారుల సమాచారాన్ని స్టోర్ చేస్తున్నారట. అందులో లబ్దిదారులకు చెందిన పేరు, చిరునామా, ఫోన్ నంబర్, ఆధార్ వివరాలు, వారు టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏవైనా పథకాలను వాడుకున్నారా, లేదా, వాడుకుంటే వాటి వివరాలు, వారి ఓటర్ ఐడీ కార్డు నంబర్లు.. తదితర సమాచారాన్నంతా టీడీపీ సేవా మిత్ర యాప్‌లో నమోదు చేస్తున్నారట. అందుకు గాను హైదరాబాద్‌లోని మాదాపూర్ కు చెందిన ఐటీ గ్రిడ్ ఆఫ్ ఇండియా, బ్లూ ఫ్రాగ్ టెక్నాలజీస్ ఐటీ సంస్థలు పనిచేస్తున్నాయట. ఈ క్రమంలో టీడీపీ సేవా మిత్ర యాప్ తో ప్రజల విలువైన వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేసి దుర్వినియోగం చేస్తున్నారని, ఆ సమాచారంతో ఏపీలో ఉన్న వైసీపీ సానుభూతి పరుల ఓట్లను పెద్ద ఎత్తున తొలగించేందుకు కుట్ర చేస్తున్నారని, దాంతో టీడీపీ ఈ సారి ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలని చూస్తుందని ఆరోపిస్తూ.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేశారు. మరోవైపు కేపీహెచ్‌బీకి చెందిన లోకేశ్వర్ రెడ్డి అనే సామాజిక కార్యకర్త కూడా ఇదే అంశంపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, రంగంలోకి దిగిన సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు కేసు విచారణ చేపట్టారు.
ఐటీ గ్రిడ్ ఆఫీసులో సోదాలు.. కీలక ఆధారాలు లభ్యం..?
సైబర్ క్రైం పోలీసులు తమ విచారణలో భాగంగా మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని ఐటీ గ్రిఫ్ ఆఫ్ ఇండియాతోపాటు బ్లూ ఫ్రాగ్ టెక్నాలజీస్ సంస్థ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించి పలు కీలకమైన ఆధారాలను సేకరించారు. ఈ క్రమంలో ఆ సంస్థలకు చెందిన నలుగురు ఉద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే తమ కంపెనీకి చెందిన భాస్కర్ అనే ఉద్యోగి కనిపించడం లేదంటూ.. ఐటీ గ్రిడ్ యాజమాన్యం ఏపీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో వారు వెంటనే స్పందించి భాస్కర్ ఆచూకీ కోసం ఏకంగా ఏసీపీ స్థాయి అధికారిని హైదరాబాద్‌కు పంపారు. అయితే భాస్కర్ తమ అదుపులో ఉన్నాడని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు చెప్పారు. దీంతో ఏపీ పోలీసులు భాస్కర్‌ను తమకు అప్పగించాలని కోరారు. అందుకు తెలంగాణ పోలీసులు నిరాకరించారు.
కేసును దర్యాప్తు చేసుకోండి.. తెలంగాణ పోలీసులతో హైకోర్టు…
అయితే తమ ఉద్యోగులను అన్యాయంగా అరెస్టు చేశారని ఐటీ గ్రిడ్ సీఈవో డాకవరం అశోక్ హైకోర్టులో పిటిషన్ వేయగా, దాన్ని విచారించిన హైకోర్టు తెలంగాణ పోలీసులను ప్రశ్నించింది. అయితే తాము ఆ కంపెనీ ఉద్యోగులను అరెస్టు చేయలేదని, వారిని ప్రశ్నించడం కోసమే అదుపులోకి తీసుకున్నామని తెలంగాణ పోలీసులు చెప్పారు. ఈ క్రమంలో ఆ ఉద్యోగులు కూడా తమను అరెస్టు చేయలేదని, ప్రశ్నించడం కోసమే పోలీసులు పిలిపించారని చెప్పగా, హైకోర్టు కేసును కొట్టి వేసింది. తెలంగాణ పోలీసులు ఈ కేసును నిరభ్యంతరంగా దర్యాప్తు చేసుకోవచ్చని చెప్పింది. దీంతో కేసు విచారణ వేగవంతం చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఏపీ ప్రజల డేటా చోరీ నిజమే: సీపీ సజ్జనార్
ఐటీ గ్రిడ్, టీడీపీ సేవా మిత్ర యాప్ ల డేటా చౌర్యంపై సైబరాబాద్ సీపీ సజ్జనార్ ఇవాళ విలేకరుల సమావేశం నిర్వహించారు. అందులో సజ్జనార్ మాట్లాడుతూ.. కేవలం ఒక ఉద్యోగి కనిపించకపోతే ఏసీపీ స్థాయి అధికారి విచారణ ఎలా చేపడుతారని ప్రశ్నించారు. ఫిర్యాదు అందుకున్న 3 గంటలలోపే ఏపీ పోలీసులు హైదరాబాద్ ఎలా వస్తారని, ఆ విషయం చాలా అనుమానాస్పదంగా ఉందని సీపీ అన్నారు. అలాగే తాము కేసు విచారణ చేస్తుంటే.. అందులో ఏపీ పోలీసులు అనవసరంగా వేలు పెడుతున్నారని ఆయన అన్నారు. ఏపీ పోలీసుల తీరు వివాదాస్పదంగా ఉందన్నారు. ఐటీ గ్రిడ్ సంస్థ టీడీపీ సేవా మిత్ర యాప్‌తో ఏపీ ప్రజల విలువైన డేటాను చోరీ చేసిన మాట వాస్తవమేనని, దీని వెనుక ఎవరు ఉన్నారో తెలుసుకుంటామని, వారు ఎంతటి వారైనా సరే.. కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఏపీ పోలీసులు ఇక్కడ ఎలా విచారణ చేస్తారు ?
ఏపీలో సంక్షేమ పథకాల లబ్దిదారుల డేటా ప్రైవేటు సంస్థ వద్ద ఎందుకు ఉందని సజ్జనార్ అనుమానం వ్యక్తం చేశారు. కచ్చితంగా ఆ డేటాను దుర్వినియోగం చేయాలనే ఉద్దేశంతోనే డేటాను సేకరించారని సీపీ తెలిపారు. ఈ విషయంపై ఎన్నికల సంఘం, ఆధార్ సంస్థలకు లేఖలు రాస్తామని తెలిపారు. నేరం జరిగిన ప్రదేశం హైదరాబాద్‌లో ఉంటే ఏపీ పోలీసులు ఎలా విచారణ చేస్తారని ప్రశ్నించారు. కాగా ఈ కేసును ముందు ముందు మరింత లోతుగా పరిశోధిస్తామని, ఈ విషయమై ఇప్పటికే లబ్ది దారుల డేటాను స్టోర్ చేసిన అమెజాన్ వెబ్ సర్వీసెస్‌కు నోటీసులు ఇచ్చామని సజ్జనార్ తెలిపారు. ఈ క్రమంలో కేసు దర్యాప్తును ముమ్మరం చేస్తామని అన్నారు. కాగా లబ్దిదారులకు చెందిన కొంత సమాచారాన్ని ఐటీ గ్రిడ్ సంస్థ పలు హార్డ్ డిస్క్‌లలో దాచి ఉంటుందని సీపీ అనుమానం వ్యక్తం చేశారు. అదేవిధంగా ఐటీ గ్రిడ్ సంస్థ సీఈవో డాకవరపు అశోక్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, అతను స్వచ్ఛందంగా పోలీసులకు లొంగిపోయి విచారణకు సహకరించాలని సజ్జనార్ తెలిపారు. అవసరం అయితే అశోక్‌ను వెదికి పట్టుకుంటామని కూడా ఆయన తెలిపారు.
ఏపీ ప్రజల డేటాను చంద్రబాబు అమ్ముకున్నారు: కేటీఆర్
టీడీపీ సేవామిత్ర యాప్ ఏమోగానీ ఐటీ గ్రిడ్ సంస్థతో కుమ్మక్కై తెలుగు దేశం పార్టీ పెద్ద ఎత్తున వైసీపీ సానుభూతి పరుల ఓట్లను తొలగించేందుకు మాత్రం సిద్ధమైందని, అందుకే పక్కాగా ఆ యాప్‌తో మాస్టర్ ప్లాన్ వేసిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఈ విషయంపై స్పందించారు. కేటీఆర్ మాట్లాడుతూ… ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించడం నేరమని, ఏపీ సీఎం చంద్రబాబు డేటాను అమ్ముకుంటున్నారని అన్నారు. ఒక వేళ బాబు తప్పు చేయకపోతే ఇంత ఉలుకుపాటు ఎందుకని, తాము నేరం చేయలేదని రుజువు చేసుకుని తమపై తాము క్లీన్ చీట్ తెచ్చుకోవచ్చు కదా అని కేటీఆర్ ప్రశ్నించారు. చంద్రబాబుకు అడ్డంగా దొరికిపోవడం అలవాటేనని, అయితే చేసిన తప్పును ఒప్పుకోకుండా గద్దెనెక్కి అరుస్తారని అన్నారు.
ఏపీ పోలీసులు తెలంగాణకు వచ్చిన జులుం చేయడం ఏంటని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చిల్లర వేషాలు, ప్రయత్నాలతో తెలంగాణ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారని అన్నారు. దీని ద్వారా బాబు ఏపీలో ఓట్లను సంపాదించుకోవచ్చని భావిస్తున్నారని, కానీ రాబోయే ఎన్నికల్లో జగనే గెలుస్తారని కేటీఆర్ అన్నారు. ఏపీ ప్రజలు తమకు ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలో వారే నిర్ణయించుకోవాలని అన్నారు. ఏపీ ప్రజల అనుమతి లేకుండా వారి డేటాను టీడీపీ ప్రభుత్వం దొంగిలించిందని కేటీఆర్ ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో ఏపీ ప్రజలు చంద్రబాబును పూర్తిగా తిరస్కరించడం ఖాయమని కేటీఆర్ అన్నారు.