సాధారణంగా రైలు బయల్దేరడానికి 4 గంటల ముందు మొదటి చార్ట్‌ను ప్రిపేర్ చేస్తారు. దీంతో ఆ చార్ట్‌ను ప్రయాణికులు ఆన్ లైన్లో చూడవచ్చు.
రైల్వే ప్రయాణికులకు శుభవార్త. ఇకపై మీరు రైలులో ఖాళీగా ఉండే బెర్తుల కోసం టీటీఈల వద్దకు పరిగెత్తాల్సిన పనిలేదు. అవును, నిజమే. ఎందుకంటే.. ఏ రైలులో అయినా సరే.. రిజర్వేషన్ చేయించుకున్నాక బెర్త్ దొరకకపోతే ట్రెయిన్ బయల్దేరడానికి ముందు చార్ట్ ప్రిపేర్ అయ్యే సమయంలో ఆ రైలులో ఆయా కోచ్‌లలో ఖాళీగా ఉన్న బెర్తుల వివరాలు మీకు ఇట్టే తెలిసిపోతాయి. అందుకు గాను ఐఆర్సీటీసీ వెబ్సైట్, యాప్‌లలో కొత్తగా ఓ ఫీచర్‌ను తాజా అందుబాటులోకి తెచ్చారు. అదే చార్ట్స్/ వెకెన్సీ ఫీచర్.
ఐఆర్సీటీసీ వెబ్సైట్, యాప్ లలో అందుబాటులోకి వచ్చిన చార్ట్స్/ వెకెన్సీ ఫీచర్ సహాయంతో ప్రయాణికులు ఆన్ లైన్లోనే తాము వెళ్లాలనుకున్న రైలులో ఆయా కోచ్‌లలో ఖాళీగా ఉండే బెర్తుల వివరాలను చాలా సులభంగా తెలుసుకోవచ్చు. ఆ వివరాలు ప్రయాణికులకు గ్రాఫిక్ రూపంలో తెలుస్తాయి. దీంతో ఖాళీగా ఉన్న బెర్తును చూపించి టీటీఈతో మాట్లాడి ఆ బెర్తును ప్రయాణికులు పొందవచ్చు. దీని వల్ల టీటీఈలు రైలులో బెర్తులు ఖాళీగా లేవని బుకాయించడం కుదరదు. ఇది ప్రయాణికులకు ఎంతగానో మేలు చేస్తుంది.
సాధారణంగా రైలు బయల్దేరడానికి 4 గంటల ముందు మొదటి చార్ట్‌ను ప్రిపేర్ చేస్తారు. దీంతో ఆ చార్ట్‌ను ప్రయాణికులు ఆన్ లైన్లో చూడవచ్చు. అలాగే రైలు బయల్దేరడానికి 30 నిమిషాల ముందు రెండో చార్ట్‌ను ప్రిపేర్ చేస్తారు. మొదటి చార్ట్ ప్రిపేర్ అయ్యాక రైలులో ఆయా కోచ్‌లలోని బెర్తులకు గాను కన్ఫాం అయిన రిజర్వేషన్లు, క్యాన్సిలేషన్ అయినవి, మార్పులు తదితర వివరాలను రెండో చార్టులో ఇస్తారు. దీంతో రైలులో బెర్తులు ఏయే కోచ్‌లలో ఖాళీగా ఉన్నాయో ఆన్లైన్లో ప్రయాణికులకు సులభంగా తెలుస్తుంది. వాటి వివరాలను తెలుసుకుంటే బెర్త్ పొందడం చాలా తేలికవుతుంది.
ఐఆర్సీటీసీ యాప్, వెబ్సైట్లో అందుబాటులోకి వచ్చిన చార్ట్స్, వెకెన్సీ ఫీచర్‌ను ఇలా ఉపయోగించుకోవచ్చు.
1. ఐఆర్సీటీసీ యాప్ లేదా వెబ్సైట్ ఓపెన్ చేసి అందులో మీరు ప్రయాణం చేయాలనుకున్న స్టేషన్ల వివరాలు, తేదీ ఎంటర్ చేసి కిందే ఉండే చార్ట్స్, వెకెన్సీ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
2. అనంతరం వచ్చే విండోలో మీరు ప్రయాణించాలనుకునే ట్రెయిన్ నంబర్, తేదీ, బోర్డింగ్ స్టేషన్ వివరాలను ఎంటర్ చేసి కింద ఉండే గెట్ ట్రెయిన్ చార్ట్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
3. తరువాత వచ్చే విండోలో ఆ ట్రెయిన్‌కు చెందిన అన్ని కోచ్‌ల నంబర్లు కనిపిస్తాయి. వాటిలో దేన్నయినా ఎంచుకుంటే ఆ కోచ్‌లో ఖాళీగా ఉన్న బెర్తుల వివరాలు గ్రీన్ కలర్లో ఉంటాయి.
4. గ్రీన్ కలర్లో బెర్త్ ఉంటే అది ఖాళీగా ఉందని, ఎల్లో కలర్ ఉంటే మార్గ మధ్యలో ఖాళీ అవుతుందని తెలుసుకోవాలి. గ్రీన్ కలర్ బెర్త్ నంబర్ చూసుకుని టీటీఈని సంప్రదిస్తే ఆ బెర్త్‌ను టీటీఈ ప్రయాణికులకు కేటాయిస్తారు.