సూర్యాపేట మెడికల్ కాలేజీలో విద్యార్థి ర్యాగింగ్ పై స్పందించారు ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు. ఈఘటనపై డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేష్ రెడ్డి ఆదేశాలు ఇచ్చామని.. ఓ కమిటీని ఏర్పాటు చేసి ఘటనపై విచారణ జరపాల్సిందిగా ఆదేశించామని మంత్రి తెలిపారు. ర్యాగింగ్ జరిగిందా లేదా.. దానికి ఎవరు బాధ్యులనే దానిపై ఈ రోజు మధ్యాహ్నం లోగా రిపోర్ట్ ఇవ్వాలని కమిటీని ఆదేశించినట్లు తెలిపారు. ఒక వేళ ర్యాగింగ్ జరిగిందని తేలితే.. సంబంధిత విద్యార్థులపై కఠినంగా చర్యలు తీసుకుంటామని.. మరోసారి ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
సూర్యాపేట మెడికల్ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతున్న స్టూడెంట్ ను రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ర్యాగింగ్ చేశారు. ఇంటి నుంచి శనివారం కాలేజీ హాస్టల్ వెళ్లిన విద్యార్థిని బట్టలు విప్పించి మొబైల్ లో షూట్ చేశారు. గుండు గీయించేందుకు కూడా ప్రయత్నించారు. అక్కడి నుంచి తప్పించుకున్న బాధిత విద్యార్థి తండ్రికి ఫోన్ చేసి చెప్పారు. వెంటనే తండ్రి డయల్ 100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. దీంతో బాధిత స్టూడెంట్ ను పోలీసులు రక్షించారు.