ఏపీలోకి కాంట్రాక్టర్లకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. రహదారుల నిర్మాణం, మరమ్మతులు చేపట్టిన కాంట్రాక్టర్లకు ప్రత్యేక బ్యాంకు ఖాతాల ద్వారా డబ్బులు చెల్లిస్తామని రహదారులు భవనాల శాఖ మంత్రి శంకర నారాయణ ప్రకటించారు. ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా రహదారుల మరమ్మతులపై తాజాగా మంత్రి శంకర నారాయణ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూడు నెలలుగా పెండింగ్ లో ఉన్న 550 కోట్ల రూపాయల మొత్తాన్ని రెండు వారాల్లోగా చెల్లించాల్సిందిగా సీఎం ఆదేశించారని పేర్కొన్నారు. న్యూ డెవలప్ మెంట్ బ్యాంక్ రుణ సహకారంతో 2970 కోట్ల రూపాయలతో తొలి దశలో చేపట్టిన పనులకు సంబంధించి త్వరితగతిన పనులు చేపట్టకపోతే.. కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెడతామని హెచ్చరించారు. ప్రత్యేక బ్యాంకు ఖాతాల ద్వారా బిల్లులను చెల్లిస్తామని ఇప్పటికే ప్రభుత్వం హామీ ఇచ్చిందని స్పష్టం చేశారు. జనవరిలోగా పనుల్లో కదలిక లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. కాంట్రాక్టర్ల విషయంలో జగన్ సర్కార్ చాలా సానుకూలంగా ఉంటుందన్నారు.