దేశ వ్యాప్తంగా కరోనా కల్లోలం కలిగిస్తోంది. దేశంలో కేసుల సంఖ్య 2 లక్షలకు చేరువ అవుతోంది. గత కొన్ని రోజుల క్రితం కేవలం రోజూ వారీ కేసుల సంఖ్య 10 వేల లోపే ఉండేది. కానీ గత కొద్ది రోజుల నుంచి దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య లక్షను దాటింది. దీంతో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూలు విధించాయి.
ఇదిలా ఉంటే ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా… కేసుల సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంది. తాజాగా ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో కరోనా కలకలం చెలరేగింది. కార్యాలయం భద్రతా సిబ్బందిలో 42 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. నిన్న ఇదే కార్యాలయంలో అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సమావేశం అయ్యారు. దీంతో బీజేపీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటికే బీజేపీ ప్రభుత్వంలోని పలువురు కేంద్రమంత్రలు కరోనా బారిన పడ్డారు. ఇప్పటికే బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీలు కరోనా బారిన పడ్డారు.