మృత్యువు పలకరించి కొన్నింటిని తీసుకుని వెళ్తుంది..కొన్నింటిని విడిచి వెళ్తుంది..దేశం కోసం ప్రాణ త్యాగం చేయడంలో కొన్ని సార్లు మాత్రమే తాను విడిచిన వాటిలో విలువైన విశ్వాసాలు ఉంటాయి.. కొల్లగొట్టలేని నమ్మకాలు ఉంటాయి..దేశం కోసం మరో వీరుడు రావాలన్నంత ఉత్సాహం ఒకటి పురస్కారాల వేళ పొంగి పొర్లుతుంది..మారుమూల ప్రాంతాల్లో కూడా బిపిన్ జీ మీకు అభిమానులు ఉన్నారు.. వారికి ఈ రోజు తీపి రోజు. చేదు బాధలు ఎన్ని ఉన్నా కూడా ఇది మాకు మా అందరికీ తీపి రోజే!
ఆహా! ఆకాశంలో తారలు..అస్సలు నిరాశలు వద్దని చెప్పిన తారలు..,మనుషుల్లో కాస్తయినా నమ్మకం, విశ్వాసం ఉండాలి అని చెప్పేంత తారలు..ఇప్పుడు నవ్వులూ తారలూ బిపిన్ రావత్ ను స్మరిస్తాయి.. కొన్ని కన్నీళ్లు వారి స్మరణలో భాగం అయి ఉంటాయి.. నవ్వులు ఆనందాలకు చెందినవి ఈ దేశం ప్రకటించిన అత్యున్నత పురస్కారానికి చెందినవి అయి ఉన్నాయి కనుక బిపిన్ రావత్ కు మనం మరోసారి అభినందనలు చెప్పాలి. ఈ నేలకు రుణపడి పోయిన ప్రతిసారీ దేశం మరో కొత్త వీరుడిని అందించి వెళ్లిందని అంటారు. చదివేను నేను.. ఆనందించాలి నేను.. వీరుడా నీకు వందనం.
మన జీవితాల్లో గొప్ప స్ఫూర్తినింపిన త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ కు కేంద్రం పద్మ విభూషణ్ ఇచ్చి సత్కరించింది. వారి అకాల మరణం నుంచి దేశం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది.మరికొందరు వీరులున్నారు కదా! వారికి స్ఫూర్తి ఇవ్వాలన్న ఓ గొప్ప ఉద్దేశం, దృక్పథం ఈ అవార్డు మోసుకుని వచ్చింది.అందుకే వీరుడికి వందనాలు చెల్లించాలి. హెలికాప్టర్ ప్రమాదంలో నీలగిరి పర్వత సానువుల్లో చనిపోయిన బిపిన్ రావత్ ..కడదాకా దేశ సేవలోనే తరించారు.భరత మాత ముద్దు బిడ్డ అతడు. వారికి నివాళి ఇస్తూ ఈ గణతంత్ర వేళ ఓ మహోన్నత పురస్కారం తన విలువను ఒక్కసారిగా ఆకాశం అంత పెంచుకుని వెళ్లింది..