పసిపిల్లలకు ఎక్కిళ్లు వస్తున్నాయా.? ఇలా చేయండి..!

-

పసిపిల్లలను పెంచటం అంటే..అంత ఈజీ కాదు..నోరు తెరిచి ఏదీ చెప్పలేని పరిస్థితి వారిది. ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఏడ్వడం తప్పా వేరే ఏం చేయలేరు. అలాంటప్పుడు మొదటిసారి తల్లి అయిన మహిళ.. ఎందుకు ఏడుస్తున్నారో తెలుసుకోలేక తల్లిడిల్లిపోతుంది. ఏడ్వటం ఒక సమస్య అయితే..బుజ్జాయిలకు ఎక్కిళ్లు వస్తాయి. మనకే ఎక్కిళ్లు వస్తే తట్టుకోలేం. ఇక అంత చిన్న చిన్న పిల్లకు వస్తే వారు ఎంత ఇబ్బందిని ఎదుర్కొంటారు.. కొందరికి చిన్నపిల్లలకు ఎక్కిళ్లు వస్తాయి అంటే నమ్మలేరు. కానీ పుట్టినప్పటి నుంచి.. ఏడాది వయసువచ్చే వరకు చిన్నపిల్లల్లో ఎక్కిళ్లు రావడం సర్వసాధారణమని. అయితే భయపడాల్సిన అవసరం లేదని అంటున్నారు.. పిల్లల వైద్య నిపుణులు. ఈరోజు వారికి ఎక్కిళ్లు రావడానికి కారణం, వాటిని ఎలా తగ్గించాలో తెలుసుకుందాం.!

ఎక్కిళ్లు రావడానికి కారణం ఏంటంటే..

డయాఫ్రమ్ ..ఇది సన్నని అస్థిపంజర కండరం, ఛాతీ భాగంలో ఉండే ఈ కండరం, ఛాతీని, పొట్టను వేరు చేస్తుంది.. ఈ డయాఫ్రమ్ సంకోచం, స్వరతంత్రులు మూసుకుపోవడం వల్ల ఇవి ఏర్పడతాయని అంటున్నారు నిపుణులు. తద్వారా గొంతులోంచి ఒక రకమైన శబ్దం వినిపించడం మనకు తెలిసిందే. ఇలా ఎక్కిళ్లు వస్తున్నప్పుడు బేబీ అసౌకర్యాన్ని దూరం చేయాలంటే కొన్ని చిట్కాల్ని పాటించాలి.

బర్పింగ్ చేయాలి!

అది బాటిల్ ఫీడింగ్ అయినా, తల్లిపాలు తాగినా.. ఇలా పిల్లలు పాలు తాగే క్రమంలో పొట్టలోకి కాస్త గ్యాస్ వెళ్లడం కామన్ .పొట్టలో గ్యాస్ ఎక్కువ కావడం వల్ల కూడా ఎక్కిళ్లు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు నిపుణులు. అందుకే దీన్ని బయటికి పంపించడానికి చిన్నారులు పాలు తాగే క్రమంలో మధ్యమధ్యలో కాస్త గ్యాప్ ఇస్తూ బర్పింగ్ (పాపాయిని కూర్చోబెట్టి నెమ్మదిగా వెన్నులో పైనుంచి కింది దాకా తట్టడం) చేయమని సూచిస్తున్నారు. తద్వారా ఎక్కిళ్లు కొంత వరకు తగ్గే అవకాశం ఉంది.

అమెరికన్ అకాడమీ ఆఫ్ పిడియాట్రిక్స్‌కి చెందిన వైద్యులు..బాటిల్ ఫీడింగ్ ఇస్తున్న పాపాయికి నాలుగు టేబుల్‌స్పూన్ల పాలు తాగాక గ్యాప్ ఇస్తూ.. ఆ మధ్యలో కాసేపు బర్పింగ్ చేయాలని, ఇక నేరుగా తల్లిపాలు తాగే చిన్నారులు ఒక రొమ్ములోని పాలు తాగడం పూర్తయ్యాక కాసేపు బర్పింగ్ చేయాలంటున్నారు..ఇలా బర్పింగ్ చేసిన తర్వాత నెమ్మదిగా వెన్నులో పైనుంచి కింది దాకా తట్టితే..తద్వారా వారికి పొట్టలోని గ్యాస్ బయటికి వెళ్లిపోయి కాస్త ఉపశమనం కలుగుతుంది.

ప్యాసిఫయర్‌తో…

కేవలం.. పాలు తాగే క్రమంలో పొట్టలోకి వెళ్లే గ్యాస్ కారణంగా చిన్నారులందరిలో ఎక్కిళ్లురావు.., కొంతమంది పిల్లల్లో ఎక్కువగా నవ్వడం వల్ల కూడా ఎక్కిళ్లు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు వైద్యులు. అయితే ఇలాంటప్పుడు వారి నోట్లో ప్యాసిఫయర్(తేనెపీక) పెట్టడం వల్ల డయాఫ్రమ్ రిలాక్సయి తద్వారా నెమ్మదిగా ఎక్కిళ్లు తగ్గే అవకాశముందట.

బాటిల్ చెక్ చేయండి!

చిన్నారులకు.. తరచూ ఎక్కిళ్లు వస్తున్నాయంటే వారు పాలు తాగే బాటిల్‌ను కూడా ఓసారి చెక్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వారు తాగే బాటిల్ ద్వారా గాలి ఎక్కువగా కడుపులోకి వెళ్లడం వల్ల కూడా ఈ సమస్య పునరావృతం అయ్యే చాన్స్ ఉంది. కాబట్టి చిన్నారులకు నేరుగా తల్లిపాలు పట్టించడం.. అలా వీల్లేని పక్షంలో నాణ్యమైన బాటిల్‌ని ఉపయోగించడం మంచిది.

గ్రైప్ వాటర్‌తో..

పిల్లలు తీసుకున్న ఆహారం జీర్ణం కాకపోయినా, కడుపునొప్పితో ఏడుస్తున్నా.. వెంటనే మనం వారికి గ్రైప్ వాటర్ అందిస్తుంటాం. ఇది వారి జీర్ణక్రియను మెరుగుపరిచి, పొట్టలో ఎలాంటి అసౌకర్యం ఉన్నా తొలగిస్తుంది. అయితే ఇది చిన్నారుల్లో తరచూ ఎదురయ్యే ఎక్కిళ్లను కూడా తగ్గిస్తుందని చెబుతున్నారు నిపుణులు. ఎక్కిళ్లు వచ్చినప్పుడు వారికి కొన్ని గ్రైప్ వాటర్ తాగించడం వల్ల ఉపశమనం కలుగుతుందట. అయితే తక్కువ ధరకొస్తుందని ఏదేదో కొనేయడం కాకుండా మంచి బ్రాండెడ్ గ్రైప్ వాటర్‌ని పిల్లలచే రోజూ తాగించడం మంచిది. తద్వారా వారిలో కడుపునొప్పి, మలబద్ధకం, అజీర్తి.. వంటి సమస్యలున్నా తగ్గిపోతాయి. చిన్నపిల్లలో విషయంలో నాణ్యమైన వాటినే ఎంచుకోవాలి.

ఎన్ని చిట్కాలు పాటించినా తగ్గకపోతే వారిని వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లడం మంచిదనేది నిపుణుల అభిప్రాయం. ఎందుకంటే కొందరు పిల్లల్లో కొన్ని ఆరోగ్య సమస్యలుంటే కూడా ఎక్కిళ్లు వస్తాయి. కాబట్టి వాటంతటవే తగ్గుతాయని నిర్లక్ష్యం చేయకుండా పదే పదే ఎక్కిళ్లు వచ్చినా, ఎక్కువ సేపు తగ్గకుండా చిన్నారుల్ని ఇబ్బంది పెట్టినా డాక్టర్‌ని సంప్రదించడం ఉత్తమం.

ఎక్కిళ్లు రాకుండా ఇలా జాగ్రత్తపడండి..

చిన్నారికి బాగా ఆకలేసినప్పుడే పాలు పట్టండి.

పాలు కొద్దికొద్దిగా ఎక్కువ సార్లు పట్టడం.

పాలు పట్టాక పావుగంట నుంచి అరగంట పాటు పాపాయిని నిటారుగా కూర్చోబెట్టండి..

బాటిల్ ఫీడింగ్ అయితే బాటిల్ నిపుల్ పూర్తిగా బేబీ నోట్లో ఉండేలా చూసుకోవడం.. అలాగే వారికి పాలు అందుతున్నాయా లేదా గమనించడం.

గమనిక: ఈ విషయాలు కేవలం మీ అవగాహన కోసమే..ఎక్కిళ్ల సమస్య ఎక్కువగా ఉన్నా..పదే పదే వస్తున్నా డాక్టర్లను సంప్రదించటం మాత్రం మర్చిపోకండి.

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news