ఓ వైపు సమతామూర్తి
మరోవైపు రాజకీయ వాగ్వాదం
ఏది ముందు ఏది వెనుక
గెలిచేది ఎవరు ఓడేది ఎవ్వరు
ఆశ్రమంలో సమానత్వం సాధ్యమేనా?
అన్న ప్రశ్న దగ్గర నుంచి దేశంలో సమానత్వం సాధ్యమేనా అన్న ప్రశ్న వరకూ చర్చ నడుస్తుంది. ఇదే సమయంలో కేసీఆర్ కూ, బీజేపీ కి మధ్య వైరం నడుస్తోంది. ఇవన్నీ ఎప్పటికి కొలిక్కి వస్తాయో కానీ ఇవాళ ప్రధాని పర్యటన మాత్రం అనేక ప్రత్యేకతల మేళవింపు.
సాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ పేరిట నెలకొల్సిన అతి భారీ విగ్రహాన్ని దేశ ప్రధాని ఇవాళ జాతికి అంకితం చేయనున్నారు. భాగ్యనగరి శివారున ముచ్చింతల్ లో జియర్ స్వామి నెలకొల్పిన ఈ విగ్రహం మరియు అక్కడ సువిశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఆశ్రమం అన్నింటినీ సందర్శించాక మోడీ తిరుగు ప్రయాణం కానున్నారు. కానీ కేసీఆర్ మాత్రం ప్రధానిని స్వాగతించేందుకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు రావడం లేదు అన్న విధంగానే సమాచారం ఉంది. ఆయన స్థానంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెళ్లనున్నారు. అయితే ఇదే ఇప్పుడు పలు వివాదాలకు దారి తీస్తుంది.
ప్రధాని స్థాయి వ్యక్తి రాష్ట్రానికి వచ్చి ముఖ్య కార్యక్రమాల్లో పాల్గొంటున్నప్పుడు ఓ ముఖ్యమంత్రి కనీసం ఆయనను స్వాగతించేందుకు వెళ్లకపోవడం ఏంటి? ఇదంతా రాజకీయ వ్యూహంలో భాగంగా లేదా అని బీజేపీ మండిపడుతోంది. ప్రొటోకాల్ ను గౌరవించి పాటించాల్సిన ముఖ్యమంత్రే దానికి విరుద్ధంగా ఉంటే ఎలా అన్న వాదన వినిపిస్తోంది. ఇదే సమయంలో బీజేపీ పై తెలంగాణ రాష్ట్ర సమితి కూడా ఫైర్ అవుతోంది.
ప్రొటొకాల్ నిబంధనలు తాము తప్పక పాటిస్తామని, ఆయన భద్రత విషయమై కానీ లేదా ఆయన ఇక్కడ ఉండే సమయంలో తగిన ఏర్పాట్లు చేసే విషయమై కానీ ఎక్కడా తాము లోటు రానివ్వబోమని అంటున్నారు. ఏ విధంగా చూసినా బీజేపీతో కేసీఆర్ బంధాలు తెగిపోయాయే అని చెప్పేందుకు ఇండికేటర్ గా కేసీఆర్ వ్యూహం కానీ నడవడి కానీ ఉండనుందన్నది స్పష్టం అయిపోయింది. జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించి తనదైన మార్కు తో రాణించాలన్న ఆలోచనలో కేసీఆర్ ఉన్నారు కనుక ఇప్పటికిప్పుడు ఆయన నుంచి శాంతి వచనాలు కానీ లేదా పరస్పర అవగాహనతో కూడిన వ్యాఖ్యలు కానీ వినలేం.