చలి చంపేస్తోంది. చలి తీవ్రతతో తెలంగాణ గజగజ వణుకుతోంది. ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతుండటంతో చలి తీవ్రత పెరిగింది. రాత్రి పూట మరింత ఎక్కువగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. జనాలు ఇళ్ల బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఉదయం 11 గంటలు కానిదే చలి తగ్గడం లేదు. ఫలితంగా జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత వారం రెండు మూడు రోజులు కాస్త ఉష్ణోగ్రతలు పెరిగినట్లుగా కనిపించినా.. మళ్లీ చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. మరి కొన్ని రోజులు తెలంగాణలో చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.
తెలంగాణలోని 9 జిల్లాలో గణనీయంగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఈ జిల్లాల్లో 10 డిగ్రీల కన్నా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్, కొమురంభీం, నిర్మల్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, జగిత్యాల, మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆదిలాబాద్ జిల్లా అర్లీ(టీ) లో అత్యల్పంగా 6.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.