చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. బుల్లి తెర వీక్షకులను అలరించిన మహాభారత్ సీరియల్ లో భీముడిపాత్రను పోషించిన ప్రవీణ్ కుమార్ సోబ్తి నిన్న రాత్రి గుండె పోటు తో మరణించారు. బీఆర్ చోప్రా రూపొందించిన మహాభారత్ సీరియల్ ఆయనకు నటుడిగా చక్కని గుర్తింపు తీసుకువచ్చింది. తన తండ్రి సోమవారం రాత్రి 10 గంటల సమయంలో.. ఢిల్లీలోని నివాసంలో ప్రవీణ్ కుమార్ మృతి చెందినట్లు ఆయన కుమార్తె నికుణిక పేర్కొంది.
కేవలం బుల్లి తెర నటుడిగానే కాకుండా అమితాబ్ షెహన్ షా, ధర్మేంద్ర లోహాతో పాటు ఆజ్ కా అర్జున్, అజూబా, ఘాయల్ తదితర చిత్రాలలో ప్రవీణ్ కుమార్ సోబ్తీ కీలక పాత్రలు పోషించారు. నటుడిగా మారక ముందు ప్రవీణ్ కుమార్ డిస్క్ త్రో క్రీడాకారుడిగా ఆయన రాణించారు. నాలుగు సార్లు ఏషియన్ గేమ్స్ లో మెడల్స్ సాధించారు. భారత్ తరఫున 1968, 1972 లలో ఒలింపిక్స్ గేమ్స్ లోనూ పాల్గొన్నారు ప్రవీణ్ కుమార్. క్రీడాకారుడిగా అర్జున అవార్డును కూడా అందుకున్నారు. ఇక ఆయన మృతి పట్లు పలువురు సంతాపం తెలిపారు.