ఫేమస్ చికెన్ చర్చి..ఆ పేరు ఎందుకు వచ్చిందో తెలిస్తే ఆశ్యర్యపోవాల్సిందే..!  

-

విచిత్రమైన కట్టడాలంటే..పర్యాటకులకు ఆసక్తి ఎక్కువ. అసలు ఈ ప్రపంచంలో వింతైన, విచిత్రమైన కట్టడాలు చాలానే ఉన్నాయి..అందులో కొన్నింటి గురించి అప్పుడప్పుడు వార్తల్లో వింటూ ఉంటాం..ఇది కూడా అలాంటిదే..ఇండోనేషియా భాషలో గెరెజా ఆయమ్(Gereja Ayam). అంటే ఇంగ్లీష్ లో చికెన్ చర్చి అని అర్థం వస్తుంది. ఎందుకంటే ఇది చూసేందుకు కోడి ఆకారంలో ఉంటుంది అట.. పవిత్రస్థలాలను ఇలా ఎక్కడా కట్టరుకదా..! మరి వీళ్లు పోయి పోయి కోడి ఆకారంలో ఎందుకు కట్టారో.. ఎందుకు కట్టాల్సివస్తుందో తెలిస్తే.. మీకు నిజంగా ఆశ్యర్యంగానే ఉంటుంది.
మనం ఇంట్లో ఏదైనా కొత్త వంటకం తయారుచేస్తుంటే.. అది ఒకటి అనుకుని మొదలస్తే..అది ఫినిషింగ్ వేరేది వస్తుంది. బంగాళదుంప కూర చేద్దామనుకుంటూ.. వంటరాని వాళ్లుకు అది బాగా ఉడికించేసి.. తిప్పితిప్పి దాన్ని చివరకి పప్పు చేస్తారు. చూసేవాళ్లు కూడా అది పప్పు అనే అనుకుంటారు.. ఇక్కడ కూడా ఇలానే అయింది.. సెంట్రల్ జావాలోని.. మాజెలాంగ్ ఏరియాలో ఈ చర్చిని పావురం ఆకారంలో నిర్మించాలని అనుకున్నారు. పావురం శాంతికి చిహ్నం కాబట్టి.. శాంతియుతమైన చర్చిగా దీన్ని ప్రజలు భావిస్తారని అనుకున్నారు. తీరా నిర్మించిన తర్వాత చూస్తే.. ఇది కోడి ఆకారంలో కనిపించింది. దాంతో చికెన్ చర్చిగా వరల్డ్ ఫేమస్ అయ్యింది.
దీని వెనక కొన్ని ఊహలు, అపోహలూ వచ్చాయి. విచిత్రమైన ప్రచారమూ జరిగింది. ఓ దశలో దీనికి లేనిపోని అంశాలను ముడిపెట్టేశారట. ఇలా రకరకాల కారణాలతో ఇది చర్చనీయాంశం అయ్యింది. ఏం జరిగినా, ఏం చేసినా.. చివరకు ఇది కోడి చర్చిగా మాత్రం ఫేమస్ అయ్యింది. మరి

 ఎవరు నిర్మించారు?

ఈ భవన నిర్మాణాన్ని డేనియల్ అలమ్స్ జా (Daniel Alamsjah) 1990లో ప్రారంభించారు. 1989లో ఆయనకు వచ్చిన ఒక కల కారణంగా.. దేవుడి కోసం ఓ భవనాన్ని నిర్మిస్తానని ప్రకటించారు. తనకు వచ్చిన కల ద్వారా తాను ఈ ప్రేరణ పొందినట్లు చెప్పారు. తాను నిర్మించే భవనం ఏ ఒక్క మతానికో సంబంధించినది కాదనీ.. అన్ని మతాల వారూ వచ్చి అందులో ప్రార్థనలూ, ధ్యానం చేసుకునేలా వీలు కల్పిస్తానని తెలిపారు.

 పూర్తి కాని నిర్మాణం:

ఈ చర్చి నిర్మాణం ప్రారంభించాక.. డేనియల్ కి ఎన్నో ఆర్థిక సమస్యలు వచ్చాయి. స్వతహాహాగా ఆయన సంపన్నుడు కాకపోవడం, ఉన్న కొద్ది పాటి డబ్బుతోనే నిర్మించేందుకు సిద్ధపడి.. చాలా పెద్ద భవన నిర్మాణం చేపట్టడం వల్ల.. డబ్బు కొరత ఆయనను వేధించింది. ఇతరుల నుంచి ఆర్థిక సాయంతో నిర్మించడం ఇష్టం లేని డేనియల్ ఎన్ని కష్టాలు పడైనా సొంతంగానే నిర్మించాలని అనుకున్నారు. అదే సమయంలో ఈ నిర్మాణం చూసి స్థానికులు ఆగ్రహించారు. వారి నుంచి తరచూ సమస్యలే. ఏం చేసైనా నిర్మాణం పూర్తి చెయ్యాలని డేనియల్ ప్రయత్నించారు. కానీ కుదరలేదు. నిర్మాణం పూర్తి కాలేదు. 2000 సంవత్సరంలో చివరిదశకు వచ్చిన నిర్మాణ పనులు ఆగిపోయాయి. ఆ తర్వాత ఈ భవనం క్రమంగా పాతదైపోతూ వచ్చింది.

 పర్యాటకులకు నచ్చింది:

ప్రపంచ దేశాల ప్రజలకు డేనియల్ ప్రయత్నం నచ్చింది. అన్ని మతాలనూ సమానంగా చూస్తూ ఆయన నిస్వార్థంతో ఈ భవన నిర్మాణం చేపట్టారనీ.. కానీ స్థానిక ప్రజలే దీన్ని చర్చిగా ప్రకటిస్తూ ఆయన్ని తప్పుపట్టారని పర్యాటకులు భావించారు. ఇలా క్రమంగా ఈ భవనానికి పాజిటివ్ పాయింట్స్ పెరిగాయి. స్థానికులు కూడా ఇక దీన్ని వ్యతిరేకించడం మానేశారు. డేనియల్ కష్టాన్ని అర్థం చేసుకున్నారు.
ఇప్పుడు ఇది చర్చిగా లేకపోయినా.. కోడి చర్చి పేరుతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. టూరిస్టులు ఇక్కడికి వచ్చి.. సెల్ఫీలు, ఫొటోలూ, వీడియోలూ తీసుకునేవారు.. కొంతమంది పెళ్లి ఫొటోషూట్లు కూడా ఇక్కడ చేసుకునేవాళ్లు. కొన్ని సినిమాల షూటింగ్స్ కూడా ఇక్కడ జరిగాయి. ఇక ఇప్పుడు ఈ భవనాన్ని దివ్యాంగులకు పునరావాస కేంద్రంగా, మత్తు పదార్థాలకు బానిసలైన వారిని వాటి నుంచి దూరం చేసేందుకు పునరావాస కేంద్రంగా వాడుతున్నారు. అలా ఇది ఓ రకమైన శరణార్థి భవనంగా మారింది.

 విచిత్రమైన వాదనలు

2016లో ఈ చర్చికి సంబంధించి ఓ డాక్యుమెంటరీ వెలుగులోకి వచ్చింది. అందులో విచిత్రమైన వాదన చేశారు. ఈ చర్చికీ, దగ్గర్లోని అగ్ని పర్వతానికీ సంబంధం ఉంది అని అందులో ఆరోపించారు. ఎలా గంటే.. కోడి (పావురం) తలపై ఉన్న ముళ్లు లేదా పించం లాంటి ఆకారం పాయింట్లు.. అగ్నిపర్వతం ఉన్న వైపును చూపిస్తున్నాయని ఆ డాక్యుమెంటరీలో వాదించారు. ఈ వాదనను కొందరు ఖండించగా.. మరికొందరు ఆధారాలు లేని ప్రకటనల వల్ల ప్రయోజనం ఉండదు అన్నారు. ఐతే.. ఈ డాక్యుమెంటరీ వల్ల కూడా ఈ చర్చికి ప్రచారం పెరిగింది. మరి అగ్నిపర్వతానికి నిజంగానే సంబంధం ఉందా లేదా అన్నది మిస్టరీగా మారింది. మొత్తానికి నిస్వార్థమైన ఆలోచనలో మొదలేసిన నిర్మాణం..ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయింది..
-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news