యుద్ధం ఉక్రెయిన్ లో ! భ‌యం భార‌త్ లో!

-

ఉక్రెయిన్ ప‌రిణామాల నేప‌థ్యంలో భార‌త్ లో అల‌జడులు రేగుతున్నాయి.ముఖ్యంగా మ‌న మార్కెట్లు న‌ష్టాల‌తోనే ఇవాళ ఆరంభం అయ్యాయి.రెండు వేల పాయింట్ల న‌ష్టాల‌తో ముంబ‌యి స్టాక్ ఎక్స్చేంజ్ ఆరంభం అయింది.దేశీయ మార్కెట్లపై యుద్ధ ప్ర‌భావం బాగానే ఉంది.అదేవిధంగా చ‌మురు ధ‌ర‌లు, బంగారం ధ‌ర‌లు కూడా ఇదే సాకుతో పెరిగేందుకు ఉన్న అవ‌కాశాల‌నూ కొట్టిపారేయ‌లేం. ముఖ్యంగా భార‌త్ లో యుద్ధ భ‌యాలు బాగానే ఉన్నాయి. స్టాక్ మార్కెట్ల కుదుపుల కార‌ణంగా ధ‌ర‌లు కూడా పెరిగే అవ‌కాశాలు ఉన్నాయ‌ని ఇక్క‌డి ప్ర‌జ‌లు ఆందోళ‌న‌లు చెందుతున్నారు. అదేవిధంగా భార‌త్ జోక్యంపై కూడా కొన్ని అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి.యుద్ధం తీవ్ర‌త‌రం అయితే ప్ర‌పంచ మార్కెట్ పై ఎటువంటి ప్ర‌భావం ఉంటుందో అంత‌కుమించిన ప్ర‌భావం మ‌న‌పై కూడా ఉంటుంద‌ని ఇంకొంద‌రు అంటున్నారు. అమెరికా సంబంధ మిత్ర దేశంగా భార‌త్ ఉంటుందా లేకా ర‌ష్యా సంబంధ మిత్ర దేశంగా భార‌త్ ఉంటుందా అన్న వాద‌న‌లు కూడా దేశీయ భ‌ద్ర‌త‌పై తీవ్ర ప్ర‌భావం చూపనున్నాయి.

ఇప్ప‌టికిప్పుడు ఉక్రెయిన్ పై యుద్ధం ప్ర‌క‌టించి ర‌ష్యా చేస్తున్న ఆక్ర‌మ‌ణ‌ల‌ను స‌మ‌ర్థిస్తే రేపు పాక్ ఆక్ర‌మిత క‌శ్మీర్ ను కూడా స‌మ‌ర్థించిన వార‌మే అవుతామని భారత పౌరుల్లో ఆందోళ‌న నెల‌కొంటోంది.క‌రోనా త‌రువాత పుంజుకుంటున్న దేశీయ మార్కెట్ల పై సెన్సెక్స్ ప‌త‌నాలు, ఇంకా చెప్పాలంటే స్టాక్ మార్కెట్ న‌ష్టాలు తీవ్ర ప్ర‌భావాన్నీ, అదేవిధంగా కోలుకోలేని విధంగా ధ‌రాఘాతాన్నీ అందించి వెళ్ల‌నున్నాయి.యుద్ధాన్ని వ్య‌తిరేకిస్తే ర‌ష్యాతో బంధం తెంపుకున్నవారమే అవుతాము క‌నుక ఆ ప‌ని వెనువెంట‌నే చేయ‌డం భార‌త్ కు సాధ్యం కానిది. క‌నుక ఆ విధంగా కూడా భార‌త్ నాయ‌కుల్లో ముఖ్యంగా దౌత్య సంబంధ వ్య‌వ‌హారాలు చూసే అధికారుల్లో ఆందోళ‌న‌లు ఉన్నాయి. ఇప్ప‌టికే ద్వైపాక్షిక సంబంధాలు అటు ర‌ష్యాతోనూ ఇటు అమెరికాతోనూ ఉన్నాయి. కానీ కొన్ని విష‌యాల్లో ర‌ష్యాను గుడ్డిగా ఇప్పుడు స‌మ‌ర్థిస్తే ప్రపంచ శాంతికి భార‌త్ స‌హ‌క‌రించ‌ని దేశంగా మిగిలిపోవ‌డం ఖాయ‌మన్న ఆందోళ‌న మ‌రియు భ‌యం దౌత్య సంబంధ వ్య‌వ‌హారాలు చూసే అధికారుల్లో నెల‌కొని ఉంది.

ఇక యుద్ధం షురూ అయిన నేప‌థ్యంలో వివిధ చ‌దువుల నిమిత్తం అక్క‌డికి వెళ్లిన భార‌తీయ విద్యార్థులు వెంట‌నే తిరిగి రావాల‌ని ఇప్ప‌టికే మ‌న విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్ర‌తినిధులు కోరారు. అమెరికా కూడా ఉక్రెయిన్ లో త‌న ఎంబ‌సీని ర‌ద్దు చేసుకుంది.త‌న ప్ర‌తినిధుల‌ను వెన‌క్కు ర‌ప్పించుకుంది. సంక్షోభ నివార‌ణ‌కు పుతిన్ మూడు మార్గాలు చెబుతున్నారు.వాటిలో ఒక‌టి క్రియిమా ప్రాంతంపై ర‌ష్యా సార్వ‌భౌమ‌త్వాన్ని ప్ర‌శ్నించ‌కూడ‌దు. ఉక్రెయిన్ గుర్తించాలి. రెండు నాటోలో చేరాల‌న్న ఆ దేశం చేస్తున్న ప్ర‌య‌త్నాలు విర‌మించుకుంటే మేలు.మూడు సైనిక బ‌ల‌గాలు పాక్షికంగా విర‌మించుకోవాలి. అని పుతిన్ చెప్పిన కొద్ది గంట‌ల్లోనే అక్క‌డ మిలిటరీ ఆప‌రేష‌న్ షురూ చేయ‌డం ప్ర‌పంచాన్నే క‌దిపి కుదిపేస్తున్న ప‌రిణామం.ఈ యుద్ధ వాతావ‌ర‌ణంలోకి అటు చైనా కానీ ఇటు అమెరికా కానీ పోద‌ల్చుకోవ‌డం లేదు. కానీ యుద్ధం ఆపేందుకు బైడెన్ కొన్ని ప్ర‌య‌త్నాలు చేసినా అవి మాత్రం ఫలితంఇవ్వ‌లేదు అన్న‌ది వాస్త‌వం.

Read more RELATED
Recommended to you

Latest news