ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అధికార పార్టీ వైసీపీ.. ప్రతి పక్ష పార్టీ టీడీపీ మధ్య వైరం పెరుగుతోంది. ఒకరిపై ఒకరు చేసుకుంటున్న విమర్శలు కూడా స్థాయి దాటిపోయాయి. అంతే కాకుండా.. ఏపీ అసెంబ్లీలో టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పై వైసీపీ ఎమ్మెల్యే అసభ్యకరంగా ప్రవర్తించిన నాటి నుంచి.. ఏపీ అసెంబ్లీలో అడుగు పెట్టబోమని చంద్రబాబు ప్రకటించారు. అలాగే టీడీపీ ఎమ్మెల్యేలు కూడా ఏపీ అసెంబ్లీలో అడుగు పెట్టమని ప్రకటించారు.
కాగ మార్చి 7 వ తేదీ నుంచి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరపడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో టీడీపీ పొలిట్ బ్యూరో కీలక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో టీడీపీ సంచలన నిర్ణయం తీసుకుంది. మార్చి 7 వ తేదీ నుంచి ప్రారంభ అయ్యే అసెంబ్లీ సమావేశాలకు వెళ్లకూడదని టీడీపీ పొలిట్ బ్యూర్ నిర్ణయం తీసుకుంది. కాగ ఈ నిర్ణయంపై మరో సారి టీడీపీఎల్పీ లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చర్చిస్తామని టీడీపీ తెలిపింది. దీని తర్వాత అసెంబ్లీ సమావేశాలకు వెళ్లక పోవడంపై ప్రకటన చేస్తామని ప్రకటించింది.