దేశంలో థర్డ్ వేవ్ ప్రభావం పూర్తిగా తగ్గింది. దేశంలో రోజూవారీ కేసులు కేవలం 5 వేలకు లోపే ఉంటున్నాయి. మరోవైపు మరణాల సంఖ్య కూడా పూర్తిగా తగ్గింది. జనవరి నెలలో దేశాన్ని ఓమిక్రాన్ కేసులు కలవరపెట్టాయి. ఇప్పుడిప్పుడే దేశంలో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే మరోవైపు ఫోర్త్ వేవ్ వస్తుందని ఆరోగ్య నిపుణులు బాంబు పేల్చారు. దేశంలో కరోనా మళ్లీ పెరిగే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చిరిస్తున్నారు. అయితే జూలై నెలలో కరోనా ఫోర్త్ వేవ్ వచ్చే అవకాశం ఉందని ఐఐటీ ఖరగ్ పూర్ పరిశోధనలు అంచనా వేశాయి. మరోవైపు ఈసారి కరోనా వస్తే దేశంలో 75 శాతం మందిపై విరుచుకుపడొచ్చని కోవిడ్ టాస్క్ గ్రూప్ చీఫ్ ఎన్ కే అరోరా హెచ్చిరిస్తున్నారు. ఇక చైనా, దక్షిణ కొరియాల్లో పెరుగుతున్న కరోనా కేసులు ఇండియాను కలవరపరుస్తున్నాయి.
ఇదిలా ఉంటే ఫోర్త్ వేవ్ వార్తల నేపథ్యంలో కేంద్రం కూడా అలెర్ట్ అయింది. అన్ని రాష్ట్రాలు, యూటీల అదనపు సెక్రటరీ లకు , ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆరోగ్య శాఖ సెక్రటరీలకు కేంద్రం ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషన్ లేఖ రాశారు. కరోనా పై ఐదు అంచెల వ్యూహాన్ని అమలు చేయాలని సూచించారు.టెస్టింగ్- ట్రాక్- ట్రీట్- వ్యాక్సినేషన్ పై ఫోకస్ చేయాలని సూచించారు. కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించాలని లేఖలో పేర్కొన్నారు.