కట్టడం కష్టం కూల్చడం సులువు
కానీ జగన్ మోహన్ రెడ్డి సర్కారు
ఇవేవీ ఆలోచించడం లేదు అన్నది ఓ వాస్తవం
అందుకే టీడీపీ హయాంలో చేపట్టిన అన్నా క్యాంటీన్లను
తమకు అనుగుణంగా మార్చుకుంటూ
పేదలకు పట్టెడన్నం పెట్టే పథకానికి తూట్లు పొడిచారు
అన్నది టీడీపీ ఆవేదన
తాజాగా కడప జిల్లా కేంద్రంలో అన్నా క్యాంటీన్ ను కూల్చేసి
ఆ స్థానంలో మున్సిపల్ కౌన్సిల్ తరఫున పెట్రోల్ బంక్ కడతామని
అంటోంది వైసీపీ…
తెలుగు దేశం పార్టీ పై ఉన్న అక్కసుతో ఆ రోజు వైసీపీ అధికారంలోకి రాగానే విజయవాడ కేంద్రంగా ఉన్న ప్రజా దర్బార్ ను కూల్చేసింది. ఆ తరువాత కృష్ణా నదికి ఆనుకుని ఉన్న కరకట్టలపై నిర్మించిన అక్రమ కట్టడాలు అన్నింటినీ తొలగిస్తామని చెప్పింది. అదే వేగంగా అన్ని అక్రమ నిర్మాణాలపైనా చర్యలు ఉంటాయని అంతా భావించారు. ముఖ్యంగా కొన్నింటిపై ఇవాళ్టికీ చర్యలు లేవు. అయినా కూడా జగన్ మోహన్ రెడ్డి పై ఉన్న నమ్మకంతో ఇప్పటికీ కొంతమంది వైఎస్సార్సీపీ నాయకులు వైరి వర్గాలతో తగువులు పడుతూనే ఉన్నారు. వీధుల్లో చాలా అక్రమ నిర్మాణాలపై ఉన్న వివాదాలు కూడా ఇవాళ్టికీ తేలడం లేదు. అయినా కూడా వైసీపీ పాత పాటే పాడుతోంది. కానీ వామపక్షాలు మాత్రం అక్రమ నిర్మాణాలన్నింటిపైనా జగన్ ఒకే విధంగా లేరు అని వ్యాఖ్యానిస్తున్నాయి.
ఈ దశలో ప్రజా దర్బారు కూల్చినంత సులువుగా బీజేపీకి చెందిన రిసార్టులను కూల్చడమనండి అని సవాలు కూడా చేస్తోంది. కృష్ణా నది కరకట్టలపై అన్ని పార్టీల నాయకులకూ చెందిన నిర్మాణాలు ఉన్నాయని వాటిని తొలగించడం అంటే అనుకున్నంత సులువు కాదు అని కూడా అంటున్నారు ఇంకొందరు ప్రజా హక్కుల సంఘాల నాయకులు. ఆ రోజు గోకరాజు గంగరాజు కు చెందిన నిర్మాణాలను అలానే ఆయుర్వేద వైద్యుడు మంతెన సత్యనారాయణ రాజు కు చెందిన ప్రకృతి ఆశ్రమ సంబంధ అక్రమ నిర్మాణాలను తొలగిస్తామని జగన్ ఊదరగొట్టారు.
కానీ ఎందుకనో కేంద్ర పెద్దలు జగన్ ను వారించడంతో వెనక్కు తగ్గారని కూడా సమాచారం. తరువాత ముందున్నంత ఆవేశంతోనూ, కోపంతోనూ జగన్ లేరు కూడా! తాజాగా కడప జిల్లాలో అన్న క్యాంటీన్ ను కూల్చేసి దాని స్థానంలో పెట్రోల్ బంక్ నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారు. నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో ఓ పెట్రోలు బంకు నిర్వహణకు దీనిని కూల్చామని కడప మున్సిపల్ కమిషనర్ మీడియాకు వెల్లడించారు. ఎంతో ఉన్నతాశయంతో 30 లక్షల రూపాయలతో అధునాతన సౌకర్యాలతో నిర్మించిన అన్నా క్యాంటీన్ కూల్చేయడంపై తెలుగు దేశం విచారం వ్యక్తం చేస్తోంది.
వాస్తవానికి ఐదు రూపాయల భోజనంతో రోజుకు ఐదు వందల మంది కడుపులు నిండేవి అని కానీ వైసీపీ అధికారంలోకి రాగానే అన్నా క్యాంటీన్లను మూసివేసిందని చెబుతూ, నాటి పరిణామాలను తల్చుకుంటున్నారు. వాస్తవానికి కడప పురపాలక సంఘం పాత కార్యాలయానికి సమీపాన ఉన్న అన్నా క్యాంటీన్ ఏర్పాటు వెనుక ఎంతో మంచి ఆశయం దాగి ఉందని, ఇక్కడ ఉన్న ప్రయివేటు ఆస్పత్రులకు వచ్చే రోగులకు మంచి భోజనం దొరక్క, ప్రయివేటు హోటళ్లు లేక రోగులు వారి బంధువులు ఎన్నో అవస్థలు పడేవారని, వారి సమస్యను తీర్చేందుకు టీడీపీ సర్కారు ముందుకు వచ్చి అన్నా క్యాంటీన్ ను ఏర్పాటు చేసిందని ప్రధాన మీడియా వెల్లడిస్తోంది.
కానీ వైసీపీ సర్కారు వచ్చాక ఇది కాస్తా కోవిడ్ సెంటర్ గా మారిపోయిందని, పోనీ అలా ఉంచినా బాగుండేదని అది కూడా లేకుండా చేసి వైసీపీ పైశాచిక ఆనందాన్ని పొందుతుందని టీడీపీ నాయకులు వాపోతున్నారు.