వెలుగు చీకట్లలో
ఏదో ఒకటి అధికారం వైపే ఉండాలి
ఉంటుంది కూడా!
ఆ విధంగా కాకినాడ పోర్టులో నెలకొన్న చీకటి
కారణంగా పేదల బియ్యం దేశం దాటి పోతోంది
అన్నది టీడీపీ ప్రధాన అభియోగం
మరి! వీటిని వెలుగులోకి తెస్తున్న వారిని ఏం చేస్తున్నారు
నోటికి వచ్చిన విధంగా తిడుతున్నారు..వీలున్నంత వరకూ
వైసీపీ రౌడీలు దౌర్జన్యం చేస్తూ పోలీసుల అండతో రెచ్చిపోతున్నారు
అన్నది టీడీపీ మరో ప్రధాన అభియోగం
మీకు ధైర్యం ఉన్నా,లేకపోయినా ద్వారంపూడిని ప్రశ్నించకండి. మీలో సాహసం ఉన్నా లేకపోయినా ద్వారంపూడి అనే కాకినాడ ఎమ్మెల్యేతో తగువులు మాత్రం పెట్టుకోకండి. బహిరంగ మార్కెట్ కు తరలిపోయే పేదల బియ్యంకు సంబంధించి ఆధారాలున్నా కూడా మీడియా దగ్గర మాట్లాడకండి. ఎందుకంటే అధికార పార్టీ మనుషులు మిమ్మల్ని చంపేస్తాం అని బెదిరిస్తారు అని అంటున్నారు టీడీపీ శాసన సభ సభ్యులు.
కాకినాడ పోర్టుకు వెళ్లకండి. అక్కడేం జరుగుతుంది అన్నది రాయకండి. ఎలానూ నిబంధనలు వదిలి చేసే ఏ ఒక్క పని కూడా
పోలీసుల కంటికి చిక్కదు. కనీస స్థాయిలో కూడా కేసులు నమోదు కావు. వేల కోట్ల వ్యాపారం అక్కడే జరిగి వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీకి ఆర్థిక సాయం అందించేందుకు అక్కడి స్థానిక ప్రజా ప్రతినిధులు తమవంతు కృషి చేస్తున్నారు. కనుక మీరు అడుగులు అటుగా వేయొద్దు. పవన్ కల్యాణ్ కానీ మిగతా వారెవ్వరు కానీ మాట్లాడవద్దు..అని అంటోంది విపక్ష పార్టీ టీడీపీ.
చాలా రోజుల నుంచి కాకినాడ పోర్టు బియ్యం ఎగుమతుల విషయమై కేరాఫ్ గా నిలుస్తోంది. ఎగుమతులు అన్నీ సక్రమంగా సాగిపోతున్నాయా అంటే అనుమానమే అని అంటోంది విపక్ష స్వరం. ఈ నేపథ్యంలో జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ కూడా ఇక్కడ జరుగుతున్న దందాలపై గతంలో మాట్లాడారు. ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పై అనేక ఆరోపణలు విస్తుబోయే రీతిలో చేశారు. ఓ ప్రముఖ మీడియా కూడా పౌర సరఫరాల శాఖకు చెందిన బియ్యం ఎలా దేశం దాటిపోతోంది అన్నది వివరంగా రాసింది. కానీ ఆ సంస్థ తరువాత ఆ పోరాట స్ఫూర్తిని కొనసాగించలేకపోయింది. అక్రమాలను అక్షరాస్త్రాలతో నిలువరించలేకపోయింది.
రాష్ట్రంలో ఇంతగా తప్పిదాలు జరుగుతున్నా పట్టించుకునే నాథుడే లేడని విపక్షం గగ్గోలు పెడుతోంది. ముఖ్యంగా మన పేదలకు అందాల్సిన బియ్యం హాయిగా సముద్రపు దారుల్లో దేశం దాటి పోతుంటే అందుకు అధికారులే సహకరిస్తుంటే తామేం చేసేదని టీడీపీ అంటోంది. దీంతో కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డితో సహా మంత్రి కొడాలి నానితో సహా వైసీపీ కీలక నేత విజయ సాయి రెడ్డి కూడా పలు అభియోగాలు ఎదుర్కొంటున్నారు విపక్షం నుంచి ! టీడీపీ హయాంలో కాకినాడ పోర్టు నుంచి 2018-19లో 4,483 కోట్ల రూపాయలు విలువైన 18.09 లక్షల టన్నుల బియ్యం ఎగుమతి అయితే, వైసీపీ పాలనలో 7,711 కోట్లు విలువైన 3.04 కోట్ల టన్నుల బియ్యం ఎగుమతి చేశారు..ఈ ఎగుమతులు అన్నీ నిబంధనలను అతిక్రమించి చేసినవే అని కింజరాపు యువ సేన చెబుతోంది. దీంతో ఈ విషయమై న్యాయ విచారణకు పట్టుబడుతోంది.
ఇక జనసేన కూడా వైసీపీ తప్పిదాలపై గొంతెత్తుతోంది. గత కొంత కాలంగా బియ్యం అక్రమ రవాణాపై తన వాదన వినిపిస్తూనే ఉంది. అందుకే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సీన్ లోకి వచ్చి పవన్ ను టార్గెట్ గా చేసుకుని తూర్పుగోదావరి జిల్లాలో ఆయన ఎక్కడ పోటీ చేసినా ఓడిస్తామని చెబుతున్నారు. అంతేకాదు జనసేన పోరు తీవ్ర తరం చేస్తే ఇంకా అనేక విషయాలు వెలుగులోకి వస్తాయి కూడా! గతంలో ఎన్నడూ లేని విధంగా పేదల బియ్యం ఎగుమతి అయిపోతున్నా అధికార పార్టీకి కోట్ల రూపాయలు
వచ్చి చేరిపోతున్నా అడ్డుకునే వారు లేరని టీడీపీ అంటోంది.