టీడీపీ అనుకున్నంత సులువుగా వైసీపీ ఓడిపోదు. అలా అని వైసీపీ అనుకున్నంత సులువుగా టీడీపీ యుద్ధం నుంచి తప్పుకోదు. కానీ ఎవరి వ్యూహం ఎలా అమలు అయినా అంతిమ విజయం తమదేనని భావిస్తున్నారు సీఎం జగన్. ఇదే సమయంలో పనిచేయని ఎమ్మెల్యేలను తప్పించాలని జగన్ భావిస్తూ ఉన్నారు. ఇప్పటికే సంబంధిత జాబితా కూడా సిద్ధం చేయించారు. ఇదే ఇప్పుడు అధికార పార్టీలో సిసలు కలవరానికి కారణం అవుతోంది.
పాదయాత్ర చేసి సాధించిన అధికారాన్ని మరోసారి నిలుపుకోవాలన్న తపనతో పనిచేయడం జగన్ ముందు ఇవాళ ఉన్న ప్రథమ కర్తవ్యం. అందుకు అనుగుణంగానే జగన్ ఎన్నో మంచి పనులు చేయాలని జనానికి మేలు చేయాలని పరితపిస్తున్నారు.
కొన్నిసార్లు ఆర్థికంగా రాష్ట్ర పరిస్థితి బాగుండకపోయినా కూడా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నిధులు తెచ్చి ఇచ్చిన మాట నిలుపుకోవాలన్న తపనతో ఉన్నారు. అదేవిధంగా వలంటీర్ వ్యవస్థను మరింత బలోపేతం చేసి పథకాల అమలు ఏ విధంగా ఉందో కూడా తెలుసుకునేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. పార్టీకి,ప్రభుతానికి వారధులుగా వలంటీర్లు పనిచేయాలన్నదే ఆయన ఆలోచన అని స్పష్టం అవుతోంది. అందుకే వారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారని కూడా తెలుస్తోంది.
సచివాలయ వ్యవస్థను గ్రామ స్థాయి వరకూ నెలకొల్పడంతో మంచి ఫలితాలే వచ్చాయని జగన్ ఓ నిర్ణయానికి వచ్చారు. జిల్లాల పర్యటన అన్నది మొదలు పెడితే ఇంకొన్ని విషయాలపై తనకు స్పష్టత వస్తుందని కూడా ఆయన భావిస్తున్నారు. ఎలానూ ఏప్రిల్ 2 నుంచి గడప గడపకూ వైఎస్సార్ కార్యక్రమానికి శ్రీకారం దిద్దాలని భావిస్తున్నారు. అదే రోజు ఉగాది కావడంతో కొత్త జిల్లాల నుంచి పాలన కూడా మొదలు కానుంది. అటు కొత్త జిల్లాల ఏర్పాటు ఇటు గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమం ప్రారంభం ఒకే రోజు చేయడం వల్ల కాస్తో కూస్తో నాయకులు జనం మధ్యకు వెళ్లే అవకాశం ఉంటుందని,ఇప్పటిదాకా ఇళ్లకే పరిమితం అయిన ఎమ్మెల్యేలు క్షేత్ర స్థాయిలో తిరిగి సమస్యలు గుర్తించేందుకు అవకాశం ఉంటుందని ఆయన భావిస్తున్నారు.
దాదాపు మూడేళ్ల పాలనకు సంబంధించి ఓ క్లారిటీ వచ్చింది. ఆయనకు సంక్షేమ పథకాలకు సంబంధించి ఉన్న నమ్మకం ఎంతో అన్నది కూడా తేలిపోయింది. విపక్షాలు ఎన్ని మాటలు అన్నా తనదైన పంథాలో వాటిని తిప్పి కొట్టగల సమర్థ నీయ ధోరణి కూడా ఒకటి ఆయనకు బాగానే ఒంటబట్టింది. ఓవిధంగా ఆ రోజు జగన్ కు ఇవాళ జగన్ కు చాలా తేడా ఉంది. అప్పుడు కొన్ని సార్లు విపక్ష నేతగా ఉన్నా కూడా మాట్లాడేందుకు కొంత వెనకడుగు వేసిన దాఖలాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు అక్రమాస్తుల కేసుల్లో కదలిక లేని కారణంగా కూడా ఆయన బాగానే ధైర్యం చేసి విపక్షాలను ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా టీడీపీ మీడియాను కూడా బాగానే కంట్రోల్ చేశారు. డిజిటల్ వింగ్ ను ఏపీ సర్కార్ తరఫున ఏర్పాటు చేసి ప్రభుత్వ పథకాలను బాగానే ప్రాచూర్యంలోకి తీసుకురాగలగుతున్నారు.