నాన్ వెజ్ లేనిదే ముద్ద దిగడం లేదా.. అయితే ఈ వ్యాధులు హద్దు దాటినట్లే..!

-

కొందరికి ముక్కలేనిదే ముద్దదిగదు. డైలీ ఏదోఒక నాన్ వెజ్ తింటూనే ఉంటారు. లేదా కనీసం వారానికి నాలుగు రోజులైన మాంసాహారం తింటారు. ఇలా తినడం వల్ల బలం వస్తుందని మనం అనుకుంటాం. కానీ ఇప్పటికే ఎంతోమంది డాక్టర్లు.. మాంసాహారం ఎక్కువగా తినడం ఆరోగ్యలక్షణం కాదని చెప్తున్నారు..తాజాగా ఓ అధ్యయనం మాంసాహారం ఎక్కువగా తినేవారికి శాఖాహారులతో పోలిస్తే.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని తేల్చింది.

వరల్డ్ క్యాన్సర్ రీసెర్చ్ ఫండ్, క్యాన్సర్ రీసెర్చ్ యూకే, ఆక్స్‌ఫర్డ్ పాపులేషన్ హెల్త్ చేసిన అధ్యయనంలో, మాంసాహారులకు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ ఉన్నట్లు తేల్చింది. ఈ అధ్యయనం BMC మెడిసిన్ జర్నల్‌లో ప్రచురించారు.

పరిశోధన ఇలా..

మొత్తం 4 లక్షల 72 వేల మందిపై పరిశోధన చేశారు. వారి డైట్ డేటా యూకే బయోబ్యాంక్ నుంచి తీసుకున్నారు. మాంసం, చేపలు తినేవారిని వివిధ వర్గాలుగా విభజించారు. ఈ పరిశోధనలో, పెస్కాటేరియన్లు అంటే చేపలను మాత్రమే తినే వ్యక్తులను ప్రత్యేక గ్రూప్ లో ఉంచారు. ఈ వ్యక్తుల ఆహార విధానం 11.4 సంవత్సరాలు అనుసరించినదే అందించినట్లు తెలిపారు.

మొదటి సమూహంలో వారానికి 5 లేదా అంతకంటే ఎక్కువ రోజులు నాన్ వెజ్ తినే వారు ఉన్నారు. వీరంతా రెడ్ మీట్ నుంచి చికెన్‌తోపాటు అన్ని రకాల నాన్ వెజ్ తినేవారు ఉన్నారు. రెండవ సమూహంలో వారానికి ఐదు లేదా అంతకంటే తక్కువ రోజులు మాంసం తినే వ్యక్తులు ఉన్నారు. మూడో గ్రూప్ లో పెస్కాటేరియన్లు, అంటే చేపలు తినేవారిని ఉంచారు. నాల్గవ గ్రూప్ లో శాఖాహారులను ఉంచారు.

నాన్ వెజ్ తినడం వల్ల కలిగే నష్టాలు..

శాఖాహారం తినే మహిళలపై చేసిన పరిశోధనలో.. రుతుక్రమం ఆగిపోయిన వారిలో రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం 18% తక్కువగా ఉన్నట్లు సైంటిస్టులు గుర్తించారు. దీనికి కారణం సాధారణ బరువు ఉన్నట్లు కనుగొన్నారు. ప్రోస్టేట్ క్యాన్సర్ ముప్పు పెస్కాటేరియన్లలో 20% తక్కువగా, మాంసాహారుల కంటే శాఖాహారులలో 31% తక్కువగా ఉన్నట్లు పేర్కొన్నారు.

సాధారణ నాన్ వెజ్ తినే వారితో పోలిస్తే తక్కువ నాన్ వెజ్ తినేవారిలో ఏదైనా క్యాన్సర్ వచ్చే ప్రమాదం 2% తగ్గిందని శాస్త్రవేత్తలు గుర్తించారు.

పెస్కాటేరియన్లలో ఈ ప్రమాదం 10% తక్కువగా ఉంటుంది. శాఖాహారులలో 14% తక్కువగా ఉంటుంది.

తక్కువ మాంసం తినేవారిలో పెద్దపేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా 9% తక్కువగా ఉన్నట్లు కనుగొన్నారు.

నిపుణుల మాటేంటి..?

శాఖాహారం కొలొరెక్టల్ క్యాన్సర్ ప్రమాదాన్ని 22% తగ్గిస్తుంది. అలాగే, ఇది ఏదైనా క్యాన్సర్ వచ్చే మొత్తం ప్రమాదాన్ని 10 నుంచి 12% తగ్గిస్తుంది. కాబట్టి శాఖాహారం ఆరోగ్యానికి మంచిదని భావిస్తున్నట్లు నిపుణులు తెలిపారు.

ఇక మొత్తానికి చెప్పొచ్చేది ఏంటంటే.. వారానికి ఒకసారి నాన్ వెజ్ ముద్దు.. డైలీ వద్దు..! ఆకుకూరలు, కూరగాయలతో హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటేన్ చేయడం ఉత్తమం.

Read more RELATED
Recommended to you

Latest news