ఇవాళ రామ నవమి తరువాత దశమి రోజున చాలా మంది దశ తిరిగిపోయింది. ఇప్పటిదాకా కాదు కాదు అనుకున్నవన్నీ అవును అయి తీరుతున్నాయి. ముఖ్యంగా టీడీపీ ని తిట్టిపోసే నాయకులకు ఇవాళ పండుగే పండుగ. ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు విధేయురాలిగా ఉన్న రోజా కానీ విడుదల రజనీ కానీ ఇవాళ వైసీపీలో పదవులు అందుకోవడమే విడ్డూరం.
ఇంకా చెప్పాలంటే తనను అసెంబ్లీలోనే అడుగు పెట్టనివ్వనని చంద్రబాబు శపథం చేశారని కానీ జగనన్న చొరవతో రెండు సార్లు ఎమ్మెల్యే అయి శాసన సభలో క్రియాశీలకంగా వ్యవహరించానని, వ్యవహరిస్తున్నానని అంటున్నారామె. ఏదేమయినా ఎట్టకేలకు దేవుడు కరుణించి రోజమ్మను మంత్రిని చేయడం విశేషంలో కెల్లా విశేషం. ఇప్పటికైనా చంద్రబాబును తిట్టడం మానుకుని, పెద్దిరెడ్డి తో గొడవ పెట్టుకోవడం మానుకుని బుద్ధిగా ఆమె ఉంటారని అనుకోవడం అత్యాశ. అయినా సరే ఆశ పడడం తప్పు కాదు.ఈ తరుణంలో ప్రముఖ నటి, నగరి ఎమ్మెల్యే, తాజా మంత్రి అయిన రోజా సెల్వమణి ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇదే ఇప్పుడు రాజకీయాల్లోనూ సినిమా వర్గాల్లోనూ సంచలనాలను నమోదు చేస్తోంది. అదేంటంటే ఇకపై తాను టీవీ షోలకు కానీ షూటింగ్లకు కానీ వెళ్లనని అన్నారామె. ముఖ్యమంత్రి తనకు అప్పగించిన బాధ్యతలు పరిపూర్ణంగా నిర్వర్తించి, మంచి పేరు తెచ్చుకుంటానని చెబుతున్నారామె.