తెలంగాణ గవర్నర్ తమిళిసై పై సీఎం కెసిఆర్ సంచలన వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.నిన్న కేబినెట్ భేటీ సందర్భంగా గవర్నర్ తీరుపై మంత్రులతో ఆయన చర్చించినట్లు సమాచారం.గవర్నర్ అత్యుత్సాహం చూపిస్తున్నారని ఆయన అన్నట్లు చెబుతున్నారు.రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేసేలా గవర్నర్ ప్రవర్తిస్తున్నారని సీఎం కేసీఆర్ ఫైర్ అయ్యారు అంటున్నారు.చాలా అంశాల పై ఆమె వితండవాదం చేస్తున్నారని ప్రభుత్వంతో ఏమాత్రం సంబంధం లేదు అన్నట్లుగా ఆమె వ్యవహార శైలి ఉందని కెసిఆర్ చెప్పినట్లు తెలుస్తుంది.గత కొన్నాళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్ తమిళిసై మధ్య దూరం పెరిగిన సంగతి తెలిసిందే.
రాజ్ భవన్ లో గణతంత్ర వేడుకలకు సీఎం సహా ప్రభుత్వం దూరంగా ఉండడం, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను గవర్నర్ లేకుండానే ప్రారంభించడం, ఆమె మేడారం కి వెళ్ళిన ప్రోటోకాల్ పాటించకపోవడం, వంటి ఘటనలు జరిగిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ఆమె ఇటీవల ఢిల్లీకి వెళ్లి రాష్ట్ర సర్కారు తీరుపై ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా కు ఫిర్యాదు చేశారు.అసలు గవర్నర్, సర్కార్ మధ్య దూరం పెరగడానికి కారణం కౌశిక్ రెడ్డి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ సీటును గవర్నర్ నిరాకరించడమే అన్న సంగతి తెలిసిందే.ఇదే విషయాన్ని ఢిల్లీ పర్యటనలోనూ గవర్నర్ తమిళిసై వెల్లడించారు కూడా.ఈ నేపథ్యంలోనే తాజాగా మంత్రులతో గవర్నర్ తీరుపై సీఎం కేసీఆర్ మాట్లాడినట్లు చెబుతున్నారు.