తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిజాం తరహా పాలన సాగిస్తున్నారని తెలంగాణ జన సమితి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం మండిపడ్డారు. నిజాం సర్కార్ లో జాగీర్ధార్లు భూములు లాక్కున్న తరహాలోనే కేసీఆర్ ప్రభుత్వం ప్రజల భూములను లాక్కుంటుందని ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లోని న్యాల్కల్ మండలంలో నిమ్జ్ ఏర్పాటు చేస్తున్నామని చెబుతూ ప్రజల నుంచి అక్రమంగా భూములను లాక్కుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నేడు జహీరాబాద్ లో రైతులు ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన హాజరై.. కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. అధికార పార్టీ నేతలు భూ ఆక్రమణలు చేయడానికే.. కేసీఆర్ నిమ్జ్ తీసుకువచ్చారని ఆరోపించారు. రూ. కోటి విలువైన భూమిని రూ. పది లక్షలకే సేకరిస్తున్నారని మండిపడ్డారు. న్యాల్కల్ లో ప్రభుత్వం చేస్తున్న అక్రమ భూ సేకరణను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. నిమ్జ్ కు పర్యవరణ శాఖ నుంచి ఇంకా అనుమతే రాలేదని అన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం అప్పడే భూ సేకరణ ఎలా చేస్తోందని ప్రశ్నించారు. దీనిపై తమ పార్టీ పోరాటం చేస్తుందని ప్రకటించారు.